Farmers | కేశంపేట, మార్చి 14 : ఆరుగాలం శ్రమించి అప్పులు చేసి పంటలు సాగు చేసిన రైతన్నలకు పంట చేతికొచ్చే సమయంలో నీరందక నేలపాలవుతుంది. ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతుండడంవల్ల భూగర్భజలాలు ఇంకిపోయి బోర్లల్లో నీరు రావడంలేదు. బోరుమోటార్లను నమ్ముకొని అప్పులు చేసి పంటలు సాగు చేసిన రైతన్నలకు బోరుబావుల్లో అడుగంటుతున్న జలాల వల్ల పంటలకు నీరందక ఎక్కడిక్కడ ఎండిపోతున్నాయి.
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని సంతాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 234లో రైతులు కుమ్మరి వెంకటేశ్ 3ఎకరాల్లో మొక్కజొన్న, కుమ్మరి రాందాస్లు 1.20 ఎకరాల్లో మొత్తం 4.20 ఎకరాల మొక్కజొన్న, 2 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. నీరులేక వరి, మొక్కజొన్న పంట దెబ్బతింది. నీరులేక నెర్రలువారిన వరి పంటను చూసిన రైతన్నలు కన్నీటి పర్యంతమవుతున్నారు. 2 ఎకరాల్లో వరిసాగుకు రూ.40 వేలు, 4.20ఎకరాల్లో మొక్కజొన్న సాగుకోసం రూ.లక్ష వరకు ఖర్చు వచ్చిందని, అప్పులు చేసి పంటలు సాగు చేస్తే పంట చేతి కొచ్చే సమయంలో ఎండిపోవడం తీవ్ర మనోవేదనకు గురి చేస్తుందని చెబుతున్నారు. ఇక రైతు రాందాస్ ఎండిపోయిన మొక్కజొన్న పంటను చేసేదిలేక తన పాడి ఆవులకు మేతగా కట్ చేసి వేస్తున్నాడు.