ఇబ్రహీంపట్నం, జూలై 7: పసి వయసులోనే చిన్నారులు లేత భుజాలపై బండెడు పుస్తకాలు మోస్తూ (School Bags) కుంగిపోతున్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు డజన్ల కొద్ది పుస్తకాలు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నాయి. దీంతో పిల్లలు పుస్తకాల బరువు మోయక తప్పటంలేదు. తరగతులు పెరిగేకొద్ది విద్యార్థుల బ్యాగు బరువు సైతం పెరుగుతుంది. సాధారణంగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఒక పలక, ఒక నోట్‌పుస్తకం ఉంటాయి. కానీ, ప్రస్తుతం ఎల్కేజీ, యూకేజీ స్థాయిలో వారితో 20 పాఠ్య, నోట్ పుస్తకాలు మోయిస్తున్నారు. పిల్లల బరువులో 10 శాతానికి మించిన బరువు వేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ప్రబుత్వం సైతం పుస్తకాల బరువుకు సంబంధించి నిబంధనలు తీసుకువచ్చినా వాటిని అమలు చేస్తున్న దాఖలాలు ఏ పాఠశాలలోనూ కనిపించటంలేదు. దీంతో విద్యార్థులకు అధిక బరువులు మోస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు విద్యార్థులు బ్యాగుల భారాన్ని మోయలేక పాఠశాలలకు వెళ్లటానికి కూడా ఇష్టపడటంలేదు. అవసరం లేని పాఠ్య, నోటు పుస్తకాలతో విద్యార్థులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.
విద్యార్థుల వీపుపై బండెడు బరువును తగ్గించటానికి 2017లో ప్రభుత్వం 22జీవో జారీచేసింది. ఎన్సీఆర్టీ ప్రకారం ప్రభుత్వం జారీ చేసిన పుస్తకాలే ప్రైవేటు పాఠశాలలో వినియోగించాలి. హోంవర్కు పేరుతో ట్యూషన్లు, స్పెషల్ క్లాసులు నిర్వహించొద్దు. ఆ పాటలతో చదువు సాగించాలి. విద్యార్థులకు వాటర్ బాటిల్ బరువు లేకుండా పాఠశాలల్లోనే తాగునీటిని అందించాలి. ఐదో తరగతి వరకు హోంవర్కు ఉండకూడదని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. అయినా విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవటంతొఓ జిల్లాలోని ప్రైవేటు పాఝఠశాలల్లో జీవో అమలుకు నోచుకోవటంలేదు.దీంతో ప్రవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారీతిన రెచ్చిపోతున్నారు. వీటిపై నిఘా ఉంచాల్సిన విద్యాశాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలలు అందజేస్తున్న మామూళ్లకు అలవాటు పడి పట్టించుకోవటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విద్యార్థులు అధిక భారం మోస్తున్నందున వారి శారీరక ఎదుగుదలపై ప్రభావం పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఒకప్పుడు ఆరు సబ్జెక్టులకు ఆరు నోట్‌బుక్స్‌తో పాటు ఒక రఫ్ నోట్‌బుక్ మాత్రమే ఉండేది. కానీ, ఇప్పుడు సబ్జెక్టుకు ఒక రఫ్ బుక్‌తో పాటు గైడ్లు, డ్రాయింగ్ రికార్డులు, డైరీలు, ఇతర బుక్‌లు కలుపకుఉని కిలోల కొద్ది పుస్తకాలను బ్యాగులో మోసుకెళ్లాల్సి వస్తుంది. రోజుకు 10కిలోల బరువు కంటే ఎక్కువగానే చిన్నారులు తమ భుజాలపై మోస్తు ఒకటి, రెండు అంతస్తుల భవనాల్లోని తరగతి గదులకు వెళుతున్నారు. దీంతో చాలామంది పిల్లలు వెన్నునొప్పి, జాయింట్ పెయిన్స్ బారీన పడుతున్నారు.
1-2 తరగతులు- 1.5 కిలోల బరువు
3-5తరగతులు- 2-3 కిలోల బరువు
6-7తరగతులు- 4 కిలోల బరువు
8-9తరగతులు- 5 కిలోల బరువు
10వ తరగతి- 8 కిలోల బరువు
అధిక బరువులతో శారీరక ఎదుగుదలలో ప్రభావం : దినేష్, వైద్య నిపుణులు..
విద్యార్థులు పాఠశాలలకు వెల్లే క్రమంలో పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాల భారం అధికమవుతుండటంతో వారి శారీరక ఎదుగుదలపై ప్రభావం పడుతోంది. అయిష్టంగా బరువు మోస్తుండటంతో వెన్నునొప్పి, ఇతర అనారోగ్య సమస్యలు వస్తుండటంతో విద్యార్థులు తీవ్ర అనారోగ్యాల భారీన పడి వారి ఎదుగుదలపై అధిక ప్రభావం పడే అవకాశముంది.