Musi River | ఏక్షణం.. ఏ బుల్డోజర్ తమపైకి వచ్చి పడుతుందోనన్న గాబరా..ఇన్నేండ్ల ఆధారం రెప్పపాటులో కుప్పకూలిపోతుందేమోనన్న హైరానా.. వెరసి మూసీ నిర్వాసితులు క్షణక్షణం భయంతో గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారుల సర్వే వారికి మరింత గుండెదడ తెప్పిస్తున్నది. మూసీ పరీవాహక ప్రాంతాల్లో రెండో రోజు శుక్రవారం సైతం నిరసనలు, ప్రతిఘటనల మధ్యే రెవెన్యూ అధికారుల సర్వే కొనసాగింది. ఉప్పల్, రాజేంద్రనగర్, బహదూర్‌పురా, ఆసిఫ్‌నగర్, చార్మినార్, అంబర్‌పేట, గోల్కొండ ఇబ్రహీంబాగ్, లంగర్‌హౌస్ డిఫెన్స్ కాలనీ, చాదర్‌ఘాట్, శంకర్‌నగర్, ముసారాంబాగ్, కొత్తపేట, మారుతీనగర్ తదితర ప్రాంతాల్లో సర్వే చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌లో 26 బృందాలు మూసీ రివర్ బెడ్లో ఉన్న నిర్మాణాలకు మార్కింగ్ చేశాయి. అయితే అధికారులకు ఎక్కడికక్కడ వ్యతిరేకతే ఎదురైంది. నిర్వాసితులు సర్వే బృందాలను తమ ఇండ్ల వద్దకు రానివ్వకుండా అడ్డుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో స్థానికులకు, అధికారులకు మధ్య తోపులాట జరిగింది. ఇంకొన్ని చోట్ల తమ ఇండ్లకు మార్కింగ్ ఇవ్వొద్దంటూ భీష్మించుకూర్చున్నారు. చైతన్యపురిలో ఓ పూల వ్యాపారి ఆత్మహత్యకు యత్నించడం మరింత ఉద్రిక్తత పెంచింది. పాతబస్తీలో మూసీ నిర్వాసితులు రోడ్లపైకి వచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. ‘రేవంత్ రెడ్డి నువ్వు సీఎం కావడం మా దౌర్భాగ్యం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డుకోవడానికి యత్నిస్తున్న చాలా మందికి పోలీసుల నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. లోపలేస్తామంటూ నిర్వాసితులపై జులం ప్రదర్శించినట్టు బాధితులు తెలిపారు.
-సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ)
అసలే గూడు కోల్పోవాల్సి వస్తున్నదని బాధపడుతున్న బడుగులకు మరో ఎదురుదెబ్బ తగలనున్నది. మూసీ రివర్ బెడ్లో నివాసమున్న అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు వచ్చే అవకాశం లేదు. అధికారులు కేవలం కొన్ని నిర్మాణాలకే మార్కింగ్ చేస్తున్నారు. ఇదేంటని కొంతమంది ప్రశ్నిస్తే డ్రోన్ సర్వే ప్రకారం తమకిచ్చిన నిర్మాణాలకు మాత్రమే మార్కింగ్ చేస్తున్నామంటూ చెబుతున్నారు. డబుల్ బెడ్రూంలు వద్దు ఇక్కడే ఉంటామని చెబుతున్న ఆ ఇండ్ల వారికి అందరికీ గృహాలు రావనే విషయంపై అవగాహన లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని నెలల కిందట మూసీకి ఇరువైపులా 2 కిలో మీటర్ల మేర డ్రోన్ సర్వే చేపట్టింది. ఆ సర్వేలో ఎఫ్టీఎల్తో పాటు బఫర్ జోన్లో ఎన్ని ఆక్రమణలున్నాయో సర్వే చేశారు. జీయో ఇన్ఫర్మేషన్ సిస్టం(జీఎస్ఐ)తో అనుసంధానం చేశారు. కాగా, ఈ సర్వేలో రివర్ బెడ్(నది గర్భం)లో 2,116 నిర్మాణాలు, బఫర్ జోన్లో మరో 7,850 నిర్మాణాలున్నాయని అధికారులు గుర్తించారు. ఇప్పుడు రెవెన్యూ అధికారులు వాటికే మార్కింగ్ చేస్తున్నారు. అయితే రివర్ బెడ్లో ఉన్న అన్ని నిర్మాణాలకు అధికారులు మార్కింగ్ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. కూల్చివేతలు ప్రారంభమయ్యాక మార్కింగ్ వేసినవి..వేయనివి అన్నీ మూసీలో కలిసిపోతాయి. కేవలం అధికారులు మార్కింగ్ వేసిన వారికి మాత్రమే డబుల్ బెడ్రూంలు కేటాయించనున్నారు. మిగిలిన వారు రోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడనున్నదని సామాజికవేత్తలు చెబుతున్నారు.
అధికారుల కాళ్ల వేళ్ల పడుతూ.. మూసీ వాసులు ఆర్తనాదాలు చేస్తున్నారు. అయినా వీరి ఆక్రందన రేవంత్ సర్కార్ వినడం లేదు. కష్టపడి పైసా పైసా కూడబెట్టుకుని ఇల్లు కట్టుకుంటే కూల్చేస్తామంటూ రావడం ఏంటని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చావడానికైనా సిద్ధం..కూల్చనివ్వమంటూ పూల వ్యాపారి మహేశ్ అధికారులను అడ్డుకునే యత్నం చేశాడు. ‘పూల వ్యాపారం చేసుకుంటూ.. నా కుటుంబాన్ని పోషిస్తున్నాను. నా భార్య ఇప్పుడు నిండు గర్భిణి. నా చెల్లండ్లు ఇక్కడే దగ్గర చదువుకుంటున్నారు. అధికారులు ఇప్పుడు వచ్చి ఎక్కడో నగరం అవతల డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తాం.. ఖాళీ చేయమంటే ఎలా. జీవనోపాధి ఎలా పొందేది. రెక్కాడితో గానీ డొక్కాడని కుటుంబం మాది. ప్రాణం పోయినా ఇక్కడే ఉంటాం.. ఇల్లు మాత్రం ఖాళీ చేయం. బలవంతంగా ఇల్లు ఖాళీ చేయాలని చూస్తే చావడమే శరణ్యం’ అంటూ మహేశ్ తల బాదుకుంటూ..పెట్రోల్ పోసుకొని..ఆత్మహత్యకు యత్నించాడు.