రంగారెడ్డి, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పింఛన్ల పెంపుతోపాటు కొత్త పింఛన్లను ఇస్తామని అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చి.. ప్రజలను నిండా ముంచింది. పవర్లోకి వచ్చి 28 నెలలు దాటినా వాటి ఊసే ఎత్తడంలేదు. కొత్త పింఛన్ల కోసం ఆన్లైన్ ద్వారా ప్రజావాణి కార్యక్రమాల ద్వారా జిల్లావ్యాప్తంగా సుమారు 10 వేల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. ఆ అప్లికేషన్లన్నీ ప్రస్తుతం పెం డింగ్లోనే ఉన్నాయి. దీంతో వృద్ధాప్యంలో ఉన్న అనేకమంది అర్హులు వాటి కోసం ఎదురుచూస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు అలవి కాని హామీలిచ్చింది. రూ.2 వేలు ఉన్న పింఛన్‌ను రూ.4వేలకు.. రూ.4 వేలున్న దివ్యాంగుల పింఛన్‌ను రూ.6 వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది. కానీ, అధికారంలోకి వచ్చి 28 నెలలు దాటినా పింఛన్ల పెంపుపై నోరు మెదపటం లేదు. ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను పెంచాలంటూ దివ్యాంగులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినా ప్రభుత్వం నుంచి స్పందన నిల్. దీంతో దివ్యాంగులు ప్రభుత్వ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 2,08,344 మంది పింఛన్‌దారులు ఉన్నారు. వారిలో వితంతువులు 84,836, దివ్యాంగులు 28వేలకుపైగా, ఒంటరి మహిళలు 6వేలకు పైగా, గీత, నేత కార్మికులు 2వేలకు పైగా ఉన్నారు. వారిలో చాలామంది మృతి చెందినా ఖాళీ అయిన స్థానంలో కొత్తవారికి ప్రభుత్వం భర్తీ చేయడంలేదు. కొత్త పింఛన్లు ఇవ్వకపోయినా కనీసం ఖాళీ అయిన వాటినైనా భర్తీ చేయాలని వారి కుటుంబసభ్యులు కోరుతున్నారు.
జిల్లాలోని పలు మున్సిపాలిటీలతోపాటు గ్రామీణ 21 మండలాలకు చెందిన అనేకమంది పది వేలకు పైగా తమకు పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నారు. గతంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండ గా ఒంటరి మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, గీత, నేత కార్మికులు కొత్త పింఛన్ల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం ఆన్లైన్లో అప్లికేషన్లను తీసుకోవడాన్ని ఆపేయడం తో.. ప్రతి సోమవారం రంగారెడ్డి కలెక్టరేట్లో జరిగే ప్రజావాణిలో పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. కానీ, వాటికి ఎప్పుడు మోక్షంమోక్షం లభిస్తుందో..?
పింఛన్లను పెంచుతామని, కొత్త వాటిని పంపిణీ చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటి ఊసే ఎత్తడంలేదు. రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత కొత్త పింఛన్ల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో పది వేలకు పైగా మంది తమకు పింఛన్‌ను మంజూరు చేయాలని దరఖాస్తు కూడా పెట్టుకున్నారు. ప్రభుత్వం స్పందించి కొత్త పింఛన్లను పంపిణీ చేయాలి.
– జంగయ్య, వీహెచ్పీఎస్ సంఘం నాయకుడు