ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంగళవారం జరిగిన గ్రామ సభలు రసాభాసగా సాగాయి. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా వంటి సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక జాబితాలు తప్పుల తడకగా ఉండడంతో నిరసనలు, నిలదీతలతో పల్లెలన్నీ రణరంగంగా మారాయి. లబ్ధిదారుల జాబితాలను అధికారులు చదివి వినిపిస్తుండగా అధిక శాతం మంది పేర్లు లేకపోవడంతో సభల్లో గందరగోళం నెలకొన్నది. ఆగ్రహిస్తున్నవారిని బుజ్జగించేందుకు మరోమారు దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు, కాంగ్రెస్ నాయకులు సూచించారు. ఇప్పటికే సమగ్ర కుటుంబ సర్వే, ప్రజాపాలన, మీ సేవల్లో దరఖాస్తులు చేసుకున్నామని, మళ్లీ దరఖాస్తులు ఏమిటని నిలదీశారు. ఆయా నియోజకవర్గాల్లో జరిగిన గ్రామ సభల్లో కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనగా, అర్హులమై ఉండి కూడా లబ్ధిదారుల జాబితాలో పేర్లు రాలేదని తీవ్రస్థాయిలో జనం తిరుగబడ్డారు. ఈ క్రమంలో మళ్లీ దరఖాస్తులు చేసుకుంటే పరిశీలిస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు సర్దిచెప్పడం కనిపించింది.
– రంగారెడ్డి, జనవరి 21 (నమస్తే తెలంగాణ)
లబ్ధిదారుల జాబితాల్లో పేర్లు లేకపోవటంతో ఆద్యంతం అసంతృప్తుల మధ్య గ్రామ సభలు సాగాయి. అధికారులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీశారు. రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలం లింగంపల్లి గ్రామంలో అర్హుల పేర్లు సైతం జాబితాలో లేవంటూ సీపీఎం నాయకులు నిలదీశారు. అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని గ్రామసభను పక్కదారి పట్టించొద్దని సూచించి ప్రశ్నించే వారిని అక్కడి నుంచి పంపించేశారు. మాడ్గుల మండలంలోని వివిధ గ్రామాల్లో జరిగిన గ్రామసభల్లో కూడా అర్హుల జాబితాపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మొయినాబాద్ మండలంలోని జన్వాడ గ్రామంలో జరిగిన గ్రామసభలో స్థానిక ఎస్సై ఓవర్ఆక్షన్ చేశారు. గ్రామసభలో ప్రశ్నిస్తున్న ఓ యువకుడిని లోపలేయండంటూ హుకూం జారీ చేశారు.
అక్కడే ఉండి వీడియో తీస్తున్న ఓ విలేకరి ఫోన్‌ను సైతం గుంజుకున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలోని పోచమ్మతండా, చిన్ననందిగామ, హుస్సేన్‌పూర్, సంగాయిపల్లి, పలుగురాళ్లతండా, బోయపల్లితండా, అన్నారం, అప్పాయిపల్లి అదేవిధంగా బొంరాస్‌పేట మండల పరిధిలో సాలింగాపూర్, మదన్‌పల్లితండా, చౌదర్పల్లి, దుద్యాల మండలంలో ఈర్లపల్లి, లగచెర్ల, అల్లిఖాన్‌పల్లి, సాగారంతండా, ఎక్కచెరువుతండాల్లో జరిగిన గ్రామ సభల్లో గందరగోళం నెలకొన్నది. ఏ పల్లెలో చూసినా సభ సాగినంత సేపు తప్పులతడకగా ఉన్న జాబితాపై నిలదీయడం కనిపించింది. పెద్దేముల్ మండల పరిధిలోని గాజీపూర్, పెద్దేముల్, గోపాల్ పూర్, నాగులపల్లి గ్రామాలలో జరిగిన గ్రామ సభల్లో తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పాల్గొనగా, తప్పుల తడకగా ఉన్న లబ్ధిదారుల జాబితాను అధికారులు చదివి వినిపిస్తుండగా పెద్ద ఎత్తున జనం తిరుగబడడంతో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శివారుల్లోని పలు మున్సిపాలిటీల్లో నిర్వహించిన గ్రామసభల్లో కూడా రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం అధికారులపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డుల్లో తమ పేర్లు లేవంటూ అధికారుల మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
గ్రామసభల్లో అధికార పార్టీ నాయకుల హడావుడి..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిర్వహించిన గ్రామసభల్లో అధికారులకంటే అధికార పార్టీ నాయకుల హడావుడి ఎక్కువగా కనిపించింది. గ్రామసభలు ప్రారంభం కాగానే, అధికారపార్టీ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు జాబితాలో ఎవరిపేర్లు ఉండాలనేదానిపై తమ అనుకూలస్తుల పేర్లను సూచించారు. తమవారి పేర్లను మాత్రమే రాయాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. పల్లెల్లోని చోటామోటా లీడర్ల హడావుడి చూసి పల్లె జనం బిత్తరపోయారు. ఇదెక్కడి పాలన.. ఇదేం న్యాయం.. అంటూ ఎదురుతిరిగారు. కాంగ్రెస్‌కు ఓట్లు వేసి అధికారంలోకి తీసుకొస్తే ఇంత అన్యాయం చేస్తారని అనుకోలే.. అంటూ ప్రజలు ముచ్చటించుకోవడం కనిపించింది.
ప్రజా పాలన కాదు.. పోలీసుల పాలన..
అర్హులకు కాకుండా అనర్హులకు సంక్షేమ పథకాలు ఎలా అందుతాయని అధికారులను ప్రశ్నిస్తే ఎస్ఐ లోపలేస్తానని బెదిరించడం ఎంతవరకు సమంజసం. ఇది ప్రజా పాలన కాదు.. పోలీసుల పాలన. ఉపాధి హామీ పనుల డబ్బులు రాలేదని కార్యదర్శిని అడిగితే మధ్యలో పోలీసులు ఎందుకు కలుగజేసుకుంటున్నారు. ప్రజా సమస్యలు, పథకాల కోసం ఏర్పాటు చేసిన సభ కాదా..? అందులో సందేహాలు ఉంటే అధికారులను అడిగి నివృత్తి చేసుకోవడం తప్పా.
– యంజాల మల్లేశ్, ముడిమ్యాల్ గ్రామం, చేవెళ్ల మండలం
ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా లాభం లేదు..
సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక సరిగా లేదు. కాంగ్రెస్ నాయకులకు తొత్తులుగా ఉండేవారికే రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా వంటి పథకాల ఫలాలు అందాయి. ఇంత దారుణాన్ని నేనెప్పుడూ చూడలేదు. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నా.. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా కాంగ్రెస్ లీడర్లకు తొత్తులు కాకుంటే అందవని అర్థమైంది. మళ్లీ ఓట్లు అడగడానికి ఏ మొహం పెట్టుకొని వస్తారో చూస్తా. రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదు.
– మహ్మద్ ముజీబ్, గాజీపూర్ గ్రామం, పెద్దేముల్ మండలం
సమస్యలుంటే అడుగొద్దా..
గ్రామ సభలో ఏమైనా సమస్యలుంటే అధికారులు, ప్రజాప్రతినిధులను అడుగొద్దా.. ? మరి గ్రామ సభ ఎందుకు పెట్టినట్టు. ఉపాధి హామీ పైసలు రాలేదని సెక్రటరీని అడిగితే ఎస్ఐ సంతోశ్‌రెడ్డి వచ్చి లోపల వేస్తా అంటూ బెదిరించడం ఏమిటీ ? ఇదేనా ప్రజాపాలన.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం.. గ్రామంలో దాదాపు 250 మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే 19 మంది పేర్లే వచ్చాయి. ఇందిరమ్మ ఇండ్ల పథకం పరిస్థితి కూడా ఇట్లనే ఉన్నది. రుణమాఫీ కూడా చాలా మందికి కాలేదు.
-ఎండీ అప్సర్, ముడిమ్యాల్ గ్రామం, చేవెళ్ల మండలం
ఎన్ని సార్లు దండాలు పెట్టాలి..
రేషన్ కార్డు కావాలని అధికారులకు ఎన్నిసార్లు దండాలు పెట్టాలి. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుంటే రేషన్ కార్డు మంజూరు కాలేదు. రేషన్ కార్డు ఉన్నవారికే మళ్లీ వచ్చాయి. ఇచ్చినవారికే మళ్లీ ఇవ్వడమేనా ఇందిరమ్మ పాలన అంటే. మేం రేషన్ కార్డుకు అర్హులం కాదా.. మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ఎంత కాలానికి వస్తది. తిండి గింజలు లేక తిప్పలు పడుతున్నా.
– బీనీబాయి, పోచమ్మతండా, కొడంగల్ మండలం
ఇల్లొస్తదని ఉన్న ఇంటిని కూల్చుకున్నా..
ఖాళీ జాగ ఉన్నోళ్లకే ఇల్లొస్తదని చెప్పిండ్రు. ఉన్న ఇల్లును కూల్చుకుని ఇందిరమ్మ ఇల్లుకు దరఖాస్తు చేసుకున్నా. ఇప్పుడు జాబితాలో పేరు లేదు. చాలామందికి ఇల్లు ఉన్నోళ్లకే ఇండ్లు మంజూరైనవి. ఇదెక్కడి ఇందిరమ్మ రాజ్యమో కాంగ్రెసోళ్లే చెప్పాలి. ఇంతటి దుర్మార్గపు కుట్రలను నేనెప్పుడూ చూడలే. అధికారులను అడిగితే మళ్లీ దరఖాస్తు చేసుకోమంటున్నరు.
– పాండునాయక్, పోచమ్మతండా, కొడంగల్ మండలం