వికారాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వర్షం దంచి కొట్టింది. గురువారం రాత్రి నుంచి వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎడతెరపి లేకుండా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మరో ఒకట్రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేయడంతోపాటు వికారాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. మరోవైపు జిల్లాలో కురిసిన భారీ వర్షానికి వాగులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. మూసీ, కాగ్నా నదులతోపాటు ఈసీ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పలు చోట్ల వాహనాల రాకపోకలు స్తంభించాయి.
కాగ్నానది ప్రమాదకర స్థాయిలో వరద ఉధృతి ఉండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పరిగిలో కురిసిన భారీ వర్షానికి పరిగి పట్టణంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పరిగి పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పరిగి-వికారాబాద్ మధ్యలో రాకపోకలు ఆగిపోయాయి. కోట్‌పల్లి ప్రాజెక్టు నుంచి అలుగు పారుతుండడంతో ధారూరు-నాగసముందర్ తదితర గ్రామాలకు రవాణా స్తంభించింది. వికారాబాద్ మండలంలోని గిరిగెట్‌పల్లి, నారాయణపూర్, నవాబుపేట మండలంలోని చిట్టిగిద్ద తదితర గ్రామాల్లో మూసీ ప్రమాదకరంగా ప్రవహిస్తున్నది.
కోట్‌పల్లి, లక్నాపూర్, శివసాగర్, జుంటుపల్లి, సర్పన్‌పల్లి చెరువులు ఫుల్లుగా నిండి అలుగు పారుతున్నాయి. కాగా, మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ సూచనతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. అత్యవసర సమయంలో సహాయం అందించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలోనూ వాగులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి.
శంకర్‌పల్లిలోని మూసీ, ప్రొద్దటూరు, చందిప్ప, సంకేపల్లి గ్రామాల్లోని వాగులు అధికంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం కలిగిం ది. చేవెళ్ల మండలంలోని దేవరంపల్లి ఈసీ వాగు, అంతారం, కౌకుంట్ల, తల్లారం గ్రామాల్లోని వాగులు పొంగిపొర్లాయి. చౌదరిగూడ మండలంలోని తుమ్మలపల్లి-లచ్చంపేట వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆయా గ్రా మాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబ్‌నగర్-కొందుర్గు మధ్యలో ఎంకిర్యాల వాగు ప్రవాహంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం కురియగా 44.4 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. మోమిన్‌పేట మండలంలో భారీ వర్షపాతం నమోదైంది. పరిగి మండలంలో 80.3 మి.మీటర్ల నమోదుకాగా, వికారాబాద్‌లో 77.1, కులకచర్లలో 76.9, నవాబుపేటలో 74.8, పరిగిలో 61.1, దోమలో 48.6, పూడూరులో 59.8, మర్పల్లిలో 49.3, ధారూరులో 62.1 , బంట్వారంలో 32.5, బషీరాబాద్‌లో 23.3, యాలాలలో 38.3 , తాండూరులో 31.2, దుద్యాలలో 28, పెద్దేముల్లో 13.2, కొడంగల్‌లో 27.2, చౌడాపూర్‌లో 25.3, దౌల్తాబాద్ మండలంలో 13.6 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు జిల్లాలో ఈ నెలలో వరుసగా కురుస్తున్న వర్షాలతో అన్ని మండలాల్లోనూ సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది.
శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి తాండూరు మండలం లోని వీర్‌శెట్టిపల్లి గ్రామం పూర్తిగా జలదిగ్భంధంలో కురుకుపోయింది. గోనూర్ వాగు, నారాయణపూర్ రోడ్డు మార్గంలోని బ్రిడ్జితోపాటు గ్రా మం నలువైపులా నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు బంద్ అయ్యాయి.