వికారాబాద్ జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నత్తనడకన సాగుతున్నది. సర్వే ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కాగా ఆదివారం సాయంత్రం వరకు జిల్లాలోని 2,77,977 కుటుంబాల్లో.. 1,45,414 ఫ్యామిలీ(సుమారు 52%)లు పూర్తి కాగా.. ఇంకా 1,32,563 కుటుంబాల సర్వే పూర్తి కావాల్సి ఉన్నది. ప్రభుత్వం ప్రకటించిన గడువు నేటి సాయంత్రంతో ముగియనుండగా.. ఒక రోజులో మిగతా 48 శాతం కుటుంబాల సర్వే పూర్తవుతుందా..? అన్న సందేహం నెలకొన్నది. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం సర్వే గడువు తేదీని పొడిగించినట్లు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
– పరిగి, నవంబర్ 17
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, 20 మండలాల్లో ఈ నెల 6వ తేదీ నుంచి సర్వే ప్రారంభమైంది. మూడు రోజులపాటు కుటుంబాలను గుర్తించి స్టిక్కర్లు వేయగా 9వ తేదీ నుంచి సర్వే షురూ కాగా.. సోమవారం వరకు పూర్తి చేయాలని అధికా రులు సూచించారు. జిల్లాలో మొత్తం 2,63,362 కుటుంబాలు ఉన్నట్లు మొదట అధికారులు పేర్కొనగా ప్రస్తుతం 2,77,977 కుటుంబాలున్నట్లు తేల్చారు. కాగా జిల్లాలో సర్వే చేపట్టేందుకు అధికారులు 2,024 మంది ఎన్యూమరేటర్లు, 208 మంది సూపర్వైజర్లను నియమించారు. తొమ్మిది రోజుల్లో ఎన్యూమరేటర్లు 52% సర్వేనే పూర్తి చేశారు.
అధికారికంగా ఒకరోజే సమయం..
సమగ్ర కుటుంబ సర్వేపై ప్రభుత్వం మొదట ఎంతో హడావుడి చేసింది. ఇందులో ఇచ్చిన ప్రశ్నలపై అనేక సందేహాలుండడం, సర్వేకు అధిక సమయం పడుతుండడం తదితర కారణాలతో నత్తనడకన కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన ప్రకారం ఈ నెల 18వ తేదీ సాయంత్రం లోపు పూర్తి కావాలి. ఈ విషయాన్ని అధికారులు ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు కూడా చెప్పారు. కానీ ఇప్పటివరకు జిల్లాలో 52% కుటుంబాల సర్వేనే పూర్తైంది. ఈ సర్వేకు ప్రభుత్వం పది రోజుల సమయం ఇవ్వగా తొమ్మిది రోజుల్లో సగమే పూర్తి కాగా.. మిగతా సగం ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. అదే విధంగా సర్వే గడువు తేదీని పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాం టి ప్రకటన రాలేదు. కానీ, కొందరు జిల్లా స్థాయి అధికారులు ఈ నెల 22వ తేదీ వరకు చేపట్టవచ్చునని పేర్కొంటుండడం గమనార్హం. అయినప్పటికీ 22వ తేదీ వరకైనా పూర్తవుతుందా అంటే సందేహామే వ్యక్తమవుతున్నది. సర్వేకు మరో పది రోజుల సమయం ఇస్తేనే పూర్తవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
20వ తేదీ తర్వాతే ఆన్లైన్లో నమోదు…
ప్రతిరోజూ సర్వే పూర్తైన తర్వాత మెటీరియల్‌ను సూపర్వైజర్ల ద్వారా మండల పరిషత్, మున్సిపాలిటీ కార్యాలయాలకు చేరవేసి ఆన్లైన్లో నమోదు చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. అందుకు అనుగుణంగా ఇప్పటివరకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. కనీసం వెబ్సైట్ కూడా ఇవ్వకపోవడంతో సర్వే వివరాలు ఆన్లైన్లో ఎంట్రీ చేసే ప్రక్రియ ప్రారంభమే కాలేదు. ఈ నెల 20వ తేదీ తర్వాతే వెబ్సైట్లో నమోదు ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మండలం :శాతాల్లో..
దోమ :5909(42శాతం)
యాలాల :5801(45శాతం)
దౌల్తాబాద్ :5921(46శాతం)
చౌడాపూర్ :3828(47శాతం)
కొడంగల్ :5770(47శాతం)
బంట్వారం :2760(48శాతం)
పెద్దేముల్ :7029(49శాతం)
పూడూరు :7058(50శాతం)
మోమిన్‌పేట :6672(50శాతం)
కులకచర్ల :6588(51శాతం)
దుద్యాల :2457(52శాతం)
వికారాబాద్ :4712(52శాతం)
పరిగి :7076(53శాతం)
బషీరాబాద్ : 7216(55శాతం)
తాండూరు : 8078(55శాతం)
మర్పల్లి : 8123(56శాతం)
కోట్‌పల్లి : 4371(57శాతం)
నవాబుపేట : 7159(58శాతం)
ధారూరు : 7663(62శాతం)
బొంరాస్‌పేట : 6923(64శాతం)
జిల్లాలోని 20 మండలాల్లో 2,33,588 కుటుంబాలకుగాను 1,21,114 (52 శాతం) కుటుంబాల సర్వే జరిగింది.
మున్సిపాలిటీల్లో..
మున్సిపాలిటీ : శాతాల్లో
తాండూరు :9622(48శాతం)
వికారాబాద్ :9267(60శాతం)
కొడంగల్ :2222(60శాతం)
పరిగి :3189(61శాతం)
ఈ నాలుగు మున్సిపాలిటీల్లో 44,389 కుటుంబాలుండగా ఆదివారం సాయంత్రానికి 24,300(55శాతం) కుటుంబాల సర్వే జరిగింది. జిల్లాలో 2,77,977 కుటుంబాలుండగా ఆదివారం సాయంత్రానికి 1,45,414 (52శాతం) కుటుంబాల సర్వే పూర్తి కాగా 1,32,563 కుటుంబాల సర్వే చేపట్టాల్సి ఉందని అధికారులు వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి.