షాబాద్, మార్చి 30 : ఆరుగాలం కష్టపడి పంటలు పండించే అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ఓ వైపు బోరుబావుల్లో నీటిమట్టం తగ్గడంతో వేసిన పంటలు ఎండుముఖం పట్టగా, మరోవైపు ఈదురుగాలులు, వడగండ్ల వర్షానికి చేతికొచ్చే సమయంలో పంట మొత్తం పాడైపోయింది. రంగారెడ్డిజిల్లా షాబాద్ మండలం ముద్దెంగూడ గ్రామానికి చెందిన కౌలు రైతు రాగులపల్లి నర్సింహులు అదే గ్రామంలో రెండు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని మొక్కజొన్న పంట సాగు చేశాడు.
ఇంకా 20 రోజుల్లో పంట చేతికొస్తదనుకునే సమయంలో లో ఓల్టేజీ కారణంగా బోరు నీరుపోయకపోవడంతో పంట ఎండిపోయింది. దీనికితోడు మూడు రోజుల క్రితం కురిసిన ఈదురు గాలులు, వడగండ్ల వర్షానికి మొక్కజొన్న పంట మొత్తం నేలకొరిగింది. దీంతో ఏమీ చేయలేక రైతు మొక్కజొన్న పంటను పశువుల మేతగా వేస్తున్నాడు. కౌలు కోసం రూ.50 వేలు, పంట పెట్టుబడి కోసం రూ.50 వేలు కలిపి మొత్తం రూ.లక్ష అప్పు చేశానని, చేసిన అప్పు ఎలా తీర్చాలోనని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని వాపోతున్నాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరుతున్నాడు.