అబిడ్స్, డిసెంబర్ 31 : నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన సోమవారం నుంచి ప్రారంభం కానున్నది. జనవరి 1న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు, మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ప్రారంభిస్తారు. స్వాతంత్య్రానికి పూర్వం నుంచి కొనసాగుతూ వస్తున్న ఈ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు 46 రోజుల పాటు కొనసాగనున్నది.
ఈ యేడాది సోమవారం ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఎగ్జిబిషన్ సొసైటీ చేపట్టింది. దాదాపు 2400 స్టాళ్లను ఏర్పాటు చేయ నుండగా అమ్యూజ్మెంట్ పార్క్, ఫుడ్ కోర్టులు, వివిధ పారిశ్రామికవేత్తల ఉత్పత్తులను విక్రయించేందుకు స్టాళ్లను ఏర్పాటు చేశారు. నుమాయిష్‌కు వచ్చే సందర్శ కులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపడుతున్నారు. పోలీస్, అగ్ని మాపక శాఖలు అప్రమత్తంగా ఉండి నుమాయిష్ విజయవంతం అయ్యేలా చర్య లు తీసుకుంటున్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపడంతో పాటు మెట్రో రైలు వేళలను పొడిగించనున్నారు.
సిటీబ్యూరో, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): నేటి నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో 83వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుందని, ఈ నేపథ్యంలో నేటి నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.