కొత్తూరు, మే 23 : చుట్టూ పచ్చని పంట పొలాలు. కూతవేటు దూరంలో ప్రసిద్ధి చెందిన పుణ్యం క్షేత్రం జహంగీర్‌పీర్ దర్గా. చుట్టూ తండాలు, గ్రామాలు మధ్యలో టీజీఐఐసీకి చెందిన 340 ఎకరాల ప్రభుత్వం స్థలం. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ కన్ను ఈ భూమిపై పడింది. అందులోని 100 ఎకరాల్లో డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలని భావించి..టీజీఐఐసీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మేడ్చల్ జిల్లావాసులకు తలనొప్పిగా మారిన జవహర్‌నగర్ చెత్త డంపింగ్‌ను సిద్ధాపూర్‌కు మార్చేందుకు సర్కార్ కుట్ర షురూ చేసింది. మండలంలోని సిద్ధాపూర్ శివారులోని 340 ఎకరాల అసైన్డ్ స్థలాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించి.. అభివృద్ధికి కోసం టీఎస్ఐఐసీకి అప్పగించింది. అంతేకాకుండా మౌలిక వసతుల కల్పనకు అధికంగా నిధులనూ కేటాయించగా.. అక్కడ అభివృద్ధి పనులు కూడా శరవేగంగా జరిగాయి. ఆ సమయంలోనే అసెంబ్లీ ఎన్నికలు వచ్చి.. ప్రభుత్వం మారడంతో ఆ స్థలం పై కాంగ్రెస్ ప్రభుత్వం కన్ను పడింది. అసెంబ్లీ, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టం కట్టిన కొత్తూరు మండలవాసులకు డంపింగ్‌యార్డును బహుమతిగా ఇచ్చేందుకు ముమ్మర కసరత్తు జరుగుతున్నది.
ఐరన్ అండ్ స్పాంజ్, రసాయన పరిశ్రమతో కొత్తూరు మండలం, మున్సిపాలిటీ ఇప్పటికే కాలుష్య కోరల్లో చిక్కుకున్నది. గాలి, నీటి కాలుష్యంతో మండల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనికి తోడు జవహర్‌నగర్ డంపింగ్‌యార్డును సిద్ధాపూర్‌కు తరలించేందుకు సర్కార్ యత్నిస్తుండడంతో మండలవాసులు రుసరుసలాడుతున్నారు. తమ ప్రాంతానికి డంపింగ్ యార్డు వస్తే ప్రజలు దుర్వాసన భరించలేరని.. దానితో రోగాలబారిన పడే ప్రమాదం ఉందని మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మండలంలోని సిద్ధాపూర్, ఎస్బీపల్లి, కొడిచర్ల, కొడిచెర్లతండా, వైఎం తండా ప్రజలు, ప్రజాప్రతినిధులు డంపింగ్ యార్డు ఏర్పాటు వ్యతిరేకం గా ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే, కలెక్టర్‌ను కలిసి డంపింగ్ యార్డు ఏర్పాటు చేయొద్దని వినతిపత్రాలు సమర్పించారు. శుక్రవారం కలెక్టరేట్లో జరిగిన ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’కు మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు తరలివెళ్లి తమ నిరసన తెలిపారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలని చూస్తే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు హెచ్చరించారు. వారికి పరిసర గ్రామాల ప్రజలు కూడా మద్దతు ప్రకటించారు. పచ్చని పంట పొలాలు, కూత వేటు దూరంలో ప్రఖ్యాత జహంగీర్ పీర్ దర్గా ఉన్న తమ ప్రాంతాన్ని మరో జవహర్‌నగర్‌గా మారిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
డంపింగ్‌యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ పార్టీలకతీతంగా ఆందోళనకు సిద్ధమవుతున్నాం. డంపింగ్‌యార్డు ఏర్పాటు చేసి తమ గ్రామాన్ని చెత్త కుప్పలా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం. ఇక్కడి పంటపొలాలను నాశనం చేయొద్దు.
– గన్నోజు శ్రీధర్‌చారి, బీజేపీ నాయకుడు, సిద్ధ్దాపూర్
సిద్ధాపూర్లో డంపింగ్‌యార్డు ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పచ్చని పంట పొలాలతో అలరారే మా గ్రామాన్ని చెత్తకుప్పగా మార్చొద్దు. ప్రతిపాదనను ప్రాథమిక దశలోనే విరమించుకోవాలి..లేకుంటే అన్ని పార్టీల సహకారంతో ఆందోళన చేపడతాం. వర్షాకాలంలో చెత్తకుప్పల్లోని నీరు చేరి పంట పొలాలను ముంచెత్తే అవకాశం ఉన్నది. ఇప్పటికే పెద్ద ఎత్తున మైనింగ్ కార్యక్రమాలు చేపట్టి పొల్యూషన్‌కు కేరాఫ్‌గా గ్రామాన్ని మార్చారు. ఇప్పు డు కొత్తగా డంపింగ్‌యార్డు అంటున్నారు. డంపింగ్‌యార్డు ఏర్పాటు చేయొద్దు.
– నరేందర్‌రెడ్డి, మాజీ వార్డు సభ్యుడు, బీఆర్ఎస్ నాయకుడు, సిద్ధ్దాపూర్