అంగీకరిస్తే ఎకరానికి రూ.20 లక్షలిస్తాం.. లేదంటే రూ.6.75 లక్షలు కోర్టులో జమచేసి భూమిని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిక
సీఎం సెగ్మెంట్లో ఆగని దాష్టీకం.. కేసుల భయంతో బిక్కుబిక్కు మంటున్నఆ నాలుగు గ్రామాల ప్రజలు
లగచర్లతోపాటు మిగతా మూడు తండాల్లోనూ వేర్వేరుగా భూ సర్వే..
తమ భూముల జోలికి రావొద్దని ప్లకార్డులతో నిరసన తెలిపిన రోటిబండతండావాసులు
వందల సంఖ్యలో పోలీసులను మోహరించి భయభ్రాంతులకు గురిచేసిన ప్రభుత్వం
ఓటేసి గెలిపించుకున్న పాపానికి నెలలుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని లగచర్లతోపాటు మిగతా మూడు తండాల ప్రజలు కన్నీరు పెడుతున్నారు. ఇటీవల లగచర్లలో జరిగిన పరిణామాలు..దాడులు.. కేసులు, అరెస్టులు తదితర ప్రభుత్వ దాష్టీకాల నుంచి ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న ఆ నాలుగు గ్రామాలపై శుక్రవారం మళ్లీ వందల సంఖ్య లో పోలీసులు, పదుల సంఖ్యలో అధికారులు విరుచుకుపడ్డారు. సర్వే పేరిట హడావిడి చేశారు. భూములు ఇవ్వాల్సిందేనని.. ఇవ్వకున్నా తాము తీసుకుని తీరుతామని తేల్చిచెప్పారు. తమ పొట్ట కొట్టొదని, తమ భూముల జోలికి రావొద్దని ప్లకార్డులతో గిరిజనులు వేడుకున్నా వారు పట్టించుకోలేదు. ఒక పక్క కేసుల భయం, మరోపక్క భూము లు పోతాయన్న బాధ ఆ గ్రామాల్లో స్పష్టం గా కనిపిస్తున్నది.
కొడంగల్, ఫిబ్రవరి 7 : లగచర్ల ఘటన జరిగిన దాదాపు రెండు నెలల తర్వాత మళ్లీ రైతుల గుండెల్లో సర్వే గుబులు మొదలైంది. శుక్రవారం రోటిబండతండా, పులిచెర్లకుంటతండా, లగచర్ల గ్రామాలకు సంబంధించి 110 ఎకరాల అసైన్డ్ భూమిలో అధికారులు భారీ పోలీసు బలగాల మధ్య సర్వే చేపట్టారు. రైతులను చెదరగొట్టేలా పోలీసులు, రెవెన్యూ అధికారులు బృందాలు గా ఏర్పడి ఒక్కో బృందం..ఒక్కో ప్రాంతంలో ఒకేసారి సర్వే చేపట్టింది. దీంతో రైతులు తమ భూములను కాపాడుకునేందుకు ఆ ప్రాంతాల్లోనే ఉండిపోయారు. కాగా అనుమతి తెలిపిన రైతులతో వారి వారి భూముల్లో అధికారులు సర్వే చేపట్టగా.. అనుమతించని రైతులను పంట పొలాల్లోకి కూడా రానివ్వలేదు. దీంతో రైతులు, పోలీసులకు మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకున్నది. రైతులు అంగీకరిస్తేనే ప్రభుత్వం భూములను తీసుకుంటుందని అధికారులు అన్నదాతలను మభ్యపెట్టారు. కానీ, వాస్తవానికి మూడు గ్రామాల్లో 110 ఎకరాల అసైన్డ్ భూమిని స్వాధీనం చేసుకునే దిశగానే ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వే కొనసాగింది. గతంలో జరిగిన ఘటనతో రైతులు కొంతవరకు భయాందోళనలో ఉండగా .. గిరిజన రైతులు తమకున్న కొద్దిపాటి పొలా న్ని ప్రభుత్వానికి అప్పగిస్తే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. రోటిబండతండాలో పలువురు గిరిజన రైతులు ప్లకార్డులతో నిరసన తెలిపారు.
సీఎం సారూ.. మా భూముల జోలికి రావొద్దు.. సర్వే పనులను వెంటనే నిలిపేయాలి.. పెట్టిన కేసులను వెంటనే రద్దు చేయాలని కోరారు. ప్రాణాలైనా ఇస్తాం కానీ.. తమ భూములను సర్కారుకు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో కొద్దిసేపు తండాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. సమ్మతి తెలిపిన రైతుల నుంచి భూములను తీసుకుంటారో.. లేదో మీ ఇష్టమని .. తమ భూములను మాత్రం ఇచ్చేది లేదన్నారు. సీఎం రేవంత్రెడ్డి గిరిజన రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం చాలా బాధగా ఉం దని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి తమకు బాధలు మొదలయ్యాయని.. కంటి కి నిద్ర, కడుపునకు కూడు లేని పరిస్థితి దాపురించిందన్నారు. భూములిచ్చేందుకు అంగీకరించిన రైతులకు ఎకరానికి రూ.20 లక్షలతోపాటు ఇంటిస్థలం, ఇందిరమ్మ ఇల్లు, ఉద్యోగం వంటి అవకాశాన్ని కల్పిస్తామని అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. అంగీకరించని రైతుల భూములను కూడా ప్రభుత్వం తీసుకుంటుందని.. వారికి ప్రభుత్వం ఆమోదించిన ధర మేరకు రూ. 6 లక్షల 75వేలు కోర్టులో జమ చేసి భూమిని తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. దానితోపాటు ఎటువంటి ఇతర సౌకర్యాలు కల్పించే అవకాశం ఉండదన్నారు.