Ibrahimpatnam | ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 9 : రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మూడు నెలల కిందట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఇప్పటికీ తొలగించలేదు. దీంతో పలు ప్రమాదాలు జరిగి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలంలోని వివిధ గ్రామాలకు చేరుకునే ప్రధాన రహదారిపై గత సంవత్సరం నవంబర్ నెలలో ఆరుట్ల గ్రామ సమీపంలో నిర్వహించే బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర మహోత్సవానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వాటిని ఇప్పటికీ తొలగించకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మంచాల మండల పరిషత్ కార్యాలయం సమీపంలో ప్రధాన రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీ పలువురు ఇబ్బందులకు గురిచేస్తుంది. కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు తొలగించేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసు అధికారులు ఇతర శాఖల అధికారులు కూడా చూసి చూడనట్లు వదిలేస్తున్నారు.
ముఖ్యంగా మండల పరిషత్ కార్యాలయానికి చేరుకోవడంతో పాటు కార్యాలయం లోపలి నుంచి బయటకు వచ్చే వాహనాలు, ప్రధాన రోడ్డుపై ప్రయాణించే వాహనాలు పలుమార్లు ఢీకొన్నాయి. పలువురు ప్రమాదాల బారిన కూడా పడ్డారు. ఈ ఫ్లెక్సీని తొలగించేందుకు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ నాయకులకు పోలీసులు అధికారులు కొమ్ముకాస్తున్నారని ఎంతోమంది అమాయకులు ప్రమాదాల గురవుతున్న ఈ ఫ్లెక్సీని తొలగించేందుకు ముందుకు రావడం లేదు.
మంచాల మండల పరిషత్ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుల భారీ కటౌట్ పలువురిని ప్రమాదాలకు గురిచేస్తుంది. దీని తొలగించాలని మండల పరిషత్ కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇతర పార్టీల నాయకులు అధికారుల దృష్టికి తీసుకుపోయిన పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. వెంటనే ఉన్నత స్థాయి అధికారులు దీనిపై చొరవ తీసుకొని ఫ్లెక్సీని తొలగించేందుకు కృషి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.