వికారాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ) : ఎల్ఆర్ఎస్(లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం)కు జిల్లాలో స్పందన అంతంత మాత్రంగానే వచ్చింది. అనుమతిలేని లే అవుట్లలో ప్లాట్లు కొన్న వారు వాటిని క్రమబద్ధీకరించుకునేందుకు 25 శాతం రాయితీ ఇచ్చినా రెగ్యులరైజ్ చేసుకునేందుకు చాలామంది ముందుకు రాలేదు. ఇప్పటికే మూడుసార్లు గడువు పొడిగించినా జిల్లాలోని గ్రామ పంచాయతీలతోపాటు మున్సిపాలిటీల్లోనూ ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న వారి నుంచి స్పందన కరువైందని అధికారులు పేర్కొంటు న్నారు. అనుమతిలేని లేఅవుట్లు, అనధికారిక ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు మార్చిలో 25 శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించింది.
అయితే, మార్చి నెల ముగిసినా దరఖాస్తుదారుల నుంచి పెద్దగా స్పం దన రాకపోవడంతో ప్రభుత్వం మరోసారి గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించినా ఫలితం లేకపోవడంతో మూడోసారి ఈనెల 3 వరకు తుది గడువును విధించినా అంతంతే ఉన్నది. మూడుసార్లు గడువును పొడిగించినా కేవలం 19 శాతం దరఖాస్తుదారులు మాత్రమే తమ అనధికారిక, అనుమతిలేని ప్లాట్లను క్రమబద్ధీకరించుకున్నారు. అయితే, జిల్లాలో ఎల్ఆర్ఎస్కు 36,995 దరఖాస్తులురాగా, వాటిలో గ్రామ పంచాయతీల నుంచి 16,095, మున్సిపాలిటీలకు సంబంధించి కొడంగల్ మున్సిపాలిటీ నుంచి 406, వికారాబాద్ మున్సిపాలిటీ నుంచి 4,026, పరిగి మున్సిపాలిటీ నుంచి 4209, తాండూరు మున్సిపాలిటీ నుంచి 12,259 దరఖాస్తులొచ్చాయి.
కాగా, కేవలం 6207 దరఖాస్తుదారులు మాత్రమే తమ అనుమతిలేని, అనధికారిక ప్లాట్లను క్రమబద్ధీకరించు కునేందుకు ఫీజును చెల్లించారు. ఎల్ఆర్ఎస్కు అత్యధికంగా దరఖాస్తులొచ్చిన తాం డూరు మున్సిపాలిటీలో కేవలం 3.93 శాతం దరఖాస్తుదారులే తమ అనధికారిక ప్లాట్లను క్రమబద్ధీకరించుకున్నారు. పరిగి మున్సిపాలిటీలోనూ 4209 దరఖాస్తులకుగాను కేవలం 2.34 శాతంతో 910 మంది దరఖాస్తుదారులు, వికారాబాద్ మున్సిపాలిటీలో 4026 దరఖాస్తులకుగాను కేవలం 1000 మందే స్పందించి ఎల్ఆర్ఎస్కు ఫీజును చెల్లించారు. అయితే ఎల్ఆర్ఎస్ కోసం 2020లో దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే.
అనధికారిక ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ఫీజు చెల్లించిన దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. దరఖాస్తుల పరిశీలనలో జాప్యం చేస్తు న్న అధికార యంత్రాంగం…ఫీజు చెల్లించినా రెగ్యులరైజ్ స్రొసీడింగ్ పత్రాలను జారీ చేయడంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఎల్ఆర్ఎస్కు ఫీజు చెల్లించి నెలలు గడుస్తున్నా ప్రొసీడింగ్ పత్రాలను జారీ చేయడంలో నిర్లక్ష్యం చేస్తుండ డంతో దరఖాస్తుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అయితే జిల్లాలో ఇప్పటివరకు 6207 మంది దరఖాస్తుదారులు ఎల్ఆర్ఎస్కు ఫీజు చెల్లించగా కేవలం 1699 దరఖాస్తుదారులకే అధికారులు రెగ్యులరైజ్ ప్రొసీడింగ్ పత్రాలను జారీ చేశారు. అదేవిధంగా జిల్లాలోని 594 గ్రామ పంచాయతీల్లో ఇప్పటివరకు 2,787 దరఖాస్తుదారులు ఫీజు చెల్లించగా 285 మంది దరఖాస్తుదారులకు పత్రాలను అందించారు. అందులో కొడంగల్ మున్సిపాలిటీలో 70 మందికి, వికారాబాద్ మున్సిపాలిటీలో 658, పరిగి మున్సిపాలిటీలో 300 , తాండూరు మున్సిపాలిటీలో 186 మంది దరఖాస్తుదారులకు సంబంధించి జిల్లా యంత్రాంగం ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు.