ఆదిబట్ల, జూలై 2 : హైకోర్టు ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. అధికారులు ఏర్పాట్లలో ఉండగా.. ఆశావహులు అటు పార్టీ పెద్దలు, ఇటు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు.
రంగారెడ్డి జిల్లాలో పంచాయతీ పోరుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. గ్రామాల్లో ఆశావహులు కూడా స్థానిక పోరుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో 21 మండలాల్లో ఎంపీటీసీ స్థానాలు 232, గ్రామ పంచాయతీలు 526, ఎంపీపీలు 21, జడ్పీటీసీలు 21, పంచాయతీ వార్డులు 4896 ఉన్నాయి. జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 7,94,653 మంది ఉండగా.. అం దులో పురుషులు 3,99,404 మంది, మహిళలు 3,95,216మంది, ఇతరులు 33 మంది ఉన్నారు. అదేవిధంగా జిల్లాలో 15 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లు, అసెంబ్లీ సెగ్మెంట్లు 8 ఉన్నాయి. జీహెచ్ఎంసీ డివిజన్లు మహేశ్వరంలో 2, ఎల్బీనగర్లో 11, గచ్చిబౌలిలో 7, రాజేంద్రనగర్‌లో 5 ఉన్నాయి.
కాగా, 2024 ఫిబ్రవరి 1న సర్పంచ్‌లు, జూన్ 31న ఎంపీటీసీ, జడ్పీటీసీలు, ఆగస్టులో మున్సిపాలిటీల పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతున్నది. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో గ్రామ, మండల స్థాయిలో కష్టపడిన ఆయా పార్టీల నాయకులు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు.
ప్రభుత్వం నుంచి ఎన్నికల నిర్వహణపై ప్రకటన రావడమే తరువాయి అన్న చందంగా పంచాయతీల్లో ఆశావహులు ప్రజలను కలిసి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ముఖ్యంగా సర్పంచ్‌కు పోటీ చేసే వారి సంఖ్య అధికంగా ఉన్నట్లు కనిపిస్తున్నది. కొన్ని గ్రామాల్లో కొన్ని పార్టీల నాయకులు యువతకు దావత్‌లు కూడా ఇస్తున్నట్లు సమాచారం. అధికార పార్టీ నాయకులు ఇప్పటికే పంచాయతీల వారీగా యువతను ఓటర్లను ఆకర్శించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
కోర్టు ఆదేశాలతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ముందుగా నిర్వహించి ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం చూస్తున్నట్లు సమాచారం. కొన్ని రోజులుగా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలపై కన్నేసిన నాయకులు ఇప్పటికే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అతి మర్యాదలు చేస్తున్నారు. తమ పార్టీ ముఖ్య నేతలను కలుస్తూ తమ అభ్యర్థిత్వాన్ని తెలుపుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తే ఓడిపోతామన్న భయం సర్కారుకు పట్టుకున్నది. ఇప్పటికే గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి.
– మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే
రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. ప్రతి ఎన్నికలోనూ బీసీలకు అన్యాయం జరుగుతున్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో బీసీలకు తమ వాటా 42% రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికలు నిర్వహించాలి. ఇప్పటికే గ్రామా ల్లో అధికారుల పాలనతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
– పల్లె గోపాల్ గౌడ్, బిఆర్ఎస్ నాయకులు