రంగారెడ్డి, ఆగస్టు 21 (నమస్తేతెలంగాణ) : రంగారెడ్డిజిల్లాలో యూరియా కోసం రైతులు అనేక ఇబ్బందులకు పడుతున్నారు. వ్యవసాయ పనులు ప్రారంభమైన నేపథ్యంలో రైతులందరికీ యూరియా, గ్రోమోర్ వంటి ఎరువులు తప్పనిసరి అయ్యింది. రైతుల డిమాండ్‌కు తగ్గట్టు అధికారులు ఎరువులు అందించకపోవటంతో రైతులు ప్రతిరోజు పీఏసీఎస్‌ల వద్ద గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో వర్షాకాలం పంటల సాగులో 1.24లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు. కాని, అంచనాలకు అదనంగా మరో 50వేల ఎకరాల్లో వరినాట్లు వేస్తున్నారు.
ఇటీవల వర్షాలు సమృద్ధిగా కురియటంతో అంచనాకు మించి రైతులువరిపంట సాగుచేస్తున్నారు. వరిపంట సాగుచేస్తున్న రైతులందరికీ యూరియా,గ్రోమోర్ అవసరముంది. కానీ, అధికారులకు ముందు చూపులేకపోవటంతో రైతుల డిమాండ్‌కు తగ్గట్టు అందించటం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా జిల్లా పరిధిలోని కొందుర్గు, కేశంపేట, నందిగామ, ఫారుఖ్నగర్మండలాల్లో వరిపంటలు పెద్దసంఖ్యలో సాగుచేస్తున్నారు. అలాగే, మాడ్గుల, తలకొండపల్లి మండలాల్లో కూడా వర్షాకాలం పంటల సాగులో రైతులు అంచనాలకు మించి వరిపంటలు సాగుచేస్తున్నారు. అలాగే, చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి,మొయినాబాద్ మండలాల్లో కూడా వరిపంటను సాగుచేస్తున్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల, యాచారం మండలాల్లో వరిపంటను అంచనాలకు మించి సాగుచేస్తున్నారు. దీంతో రైతులకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచకపోవటంతో రైతులు యూరియా కోసం అనేక ఇబ్బందులకు గురువుతున్నారు. ప్రతిరోజు ఉదయం వ్యవసాయ పనులన్నీ వదులుకుని ఎరువుల కోసం రైతులు పీఏసీఎస్‌ల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే నందిగామ, కేశంపేట, కొందుర్గు, తలకొండపల్లి వంటి మండలాల్లో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. వ్యవసాయాధికారులు రైతుల డిమాండ్కనుగుణంగా ఎరువులు అందుబాటులో ఉంచకపోవటంతో సమస్య తలెత్తుతుందని పలువురు రైతులు వాపోతున్నారు.
30వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం..
రంగారెడ్డిజిల్లాలో ఈ యాసంగి సీజన్లో రైతులకు సుమారు 30వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంది. కానీ, ఇప్పటివరకు 19వేల మెట్రిక్‌టన్నుల యూరియాను కూడా అధికారులు సరిగ్గా సరఫరా చేయలేకపోయారు. జిల్లా వ్యాప్తంగా 1.50లక్షల ఎకరాల్లో వరిపంట సాగుచేస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు. కాగా, ఇప్పటి వరకు కేవలం 50 నుంచి 60వేల ఎకరాల్లో మాత్రమే వరినాట్లు వేస్తున్నారు. 50శాతం కూడా వరినాట్లు పూర్తికాలేదు. అయినప్పటికి గ్రామాల్లో యూరియా కొరత తీవ్రరూపం దాల్చింది. రైతుల డిమాండ్కనుగుణంగా యూరియా సరఫరా చేయటంలో అధికారులు చేతులెత్తేశారు. దీంతో రైతులు యూరియా కోసం గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే రైతులకు ఇబ్బందులు
గత బీఆర్ఎస్ పాలనలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునేది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి యూరియా కూడా దొరకడం లేదు. పండించిన పంటలకు మద్దతు ధర లేదు. పంటలు కోనుగోలు చేయడం లేదు. కరెంట్ సరిగ్గా ఉండడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో అన్నదాత అన్ని రకాలుగా అవస్థలు పడుతున్నాడు. ప్రభుత్వం ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి.
– జంగ మల్లేశ్, రైతు, జంగోనిగూడ
యూరియా కోసం నానా పాట్లు పడుతున్నాం..
రైతులకు వర్షాకాల పంటలకు అవసరమైన యూరియాను అందుబాటులో లేక పోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు సరిపడ యూరియాను అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కోసం రైతులు చెప్పులు పెట్టి రోజుల తరబడి వేచిచూసినా అరకొరగానే లభిస్తున్నది. అధికారంలోకి రాక ముందు రైతులను రాజు చేస్తామని చెప్పి.. తీరా ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇప్పటికైనా ప్రభుత్వం యూరియా గోస తీర్చే ఏర్పాట్లు చేయాలి.
– రమేష్‌నాయక్, రైతు చెన్నారం తండా, తలకొండపల్లి మండలం