వికారాబాద్, జనవరి 21, (నమస్తే తెలంగాణ): జిల్లా వైద్యారోగ్య శాఖలో వసూళ్ల పర్వం అగడం లేదనే ప్రచారం జరుగుతున్నది. ఆ శాఖలోని అవినీతి ఉద్యోగుల బాగోతాన్ని సంబంధిత శాఖలో పనిచేసే ఉద్యోగులు ఎవరో ఒకరు బయటపెడుతున్నా లంచగొండి ఉద్యోగుల తీరు మాత్రం మారడంలేదు. ఇటీవల ప్రైవేట్ ఆసుపత్రులకు తనిఖీల పేరిట షోకాజు నోటీసులు జారీ చేసి వసూళ్లకు పాల్పడి అబాసుపాలైన జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు సంబంధిత శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులను కూడా వదలడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటెండర్ మొదలుకొని మెడికల్ ఆఫీసర్ల వరకు ఎవర్నీ వదలకుండా అందినకాడికి వసూళ్లు చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది.
ప్రధానంగా విధుల్లో నిర్లక్ష్యంతో సస్పెన్షకు గురైన ఓ మెడికల్ ఆఫీసర్ వైద్యారోగ్య శాఖలో ఏవోగా అవతారమెత్తిన నాటి నుంచి ప్రతీ పనికి, ప్రతీ ఫైల్‌కు పైసలివ్వనిదే కదిలే ప్రసక్తి లేదంటూ బరితెగించి వసూళ్లకు పాల్పడుతున్నారంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. డీఎంహెచ్‌వో ప్రోత్సాహంతోనే ఏవో బరితెగించి అటెండర్లు మొదలుకొని అధికారుల వరకు అందరి నుంచి అందినకాడికి వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. కలెక్టరేట్లోని జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో వసూళ్ల బాగోతం బయటకు రాకుండా తన మనుషులను డిప్యూటేషన్‌పై డీఎంహెచ్‌వో కార్యాలయంలో పోస్టింగ్‌లు ఇప్పిస్తూ, మాట విననివారిని పీహెచ్‌సీలకు బదిలీ చేస్తున్నట్లు తెలిసింది.
మరోవైపు డీఎంహెచ్‌వో, ఏవో వేధింపులతో ఇటీవల తాండూరు డిప్యూటీ డీఎంహెచ్‌వో లాంగ్ లీవ్‌లో వెళ్లినట్లు సమాచారం. కాగా ఇదే పోస్టులో కొత్తగా జిల్లాకు వచ్చిన డిప్యూటీ డీఎంహెచ్‌వోలకు కాకుండా గతంలో ఇన్చార్జి డిప్యూటీ డీఎంహెచ్‌వోగా పనిచేసిన అనుభవంతోపాటు తాండూరు డివిజన్లోని ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోంలపై పట్టున్న అధికారికి మళ్లీ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. జరుగుతున్న ఈ వసూళ్ల బాగోతాన్ని త్వరలో స్పీకర్ ప్రసాద్‌కుమార్ దృష్టికి తీసుకువెళ్లేందుకు పలువురు ఉద్యోగులు సిద్ధమైనట్లు తెలిసింది.
జిల్లా వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారైంది. డీఎంహెచ్‌వో, ఏవో కలిసి అందినకాడికి దోచుకుంటున్నారని సంబంధిత శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఉద్యోగులకు అత్యవసరం వచ్చి సెలవు కావాలంటే కూడా ఏవోకు ఎంతో కొంత ముట్టజెప్పితేనే మంజూరు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఓ మెడికల్ అధికారి తన బిడ్డ న్యూమోనియాతో బాధపడుతున్నాడని చైల్డ్ కేర్ సెలవు మంజూరు చేయాలని కోరితే ఏవో రూ.50 వేలు డిమాండ్ చేయగా, చివరకు రూ.20 వేలు ఇచ్చేందుకు మెడికల్ అధికారి ఒప్పుకోగా.. బుధవారం సెలవు మంజూరు చేసినట్లు సమాచారం. జిల్లాలో ఓ పీహెచ్సీలో పనిచేస్తున్న ఓ మెడికల్ అధికారి క్రిస్మస్ సెలవు కోసం లెటర్ పెట్టుకుంటే వారం రోజుల సెలవు మంజూరు చేసి రూ.15 వేలు వసూలు చేసినట్లు తెలిసింది. సదరు మెడికల్ అధికారి సెలవు తీసుకొని విదేశాలకు వెళ్లినట్లు తెలిసింది. విదేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా హెల్త్ డైరెక్టర్ సెలవు మంజూరు చేయాల్సి ఉన్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా రూ.15 వేలు వసూలు చేసి సెలవు మంజూరు చేసినట్లు ఆరోపణలున్నాయి.
ఓ మెడికల్ అధికారి అబార్షన్ కోసం సెలవు మంజూరు చేయమని లెటర్ పెట్టుకుంటే రూ.20 వేలు వసూలు చేసినట్లు తెలిసింది. మరోవైపు ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు జారీ చేయడంలోనూ డబ్బులు డిమాండ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులివ్వలేరని కొందరు మెడికల్ అధికారులకు గత నెలలోనే ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్లను డబ్బులిస్తేనే ఇంక్రిమెంట్లు అంటూ పెండింగ్‌లో పెట్టినట్లు పలువురు మెడికల్ అధికారులు తమ గోడును చెప్పుకొంటున్నారు.
వైద్యారోగ్య శాఖలో డిప్యుటేషన్ల పేరిట కూడా వసూళ్లకు పాల్పడుతున్నారు. రెండు నెలల క్రితం ఓ అటెండర్‌ను మోమిన్‌పేట్ పీహెచ్సీ నుంచి పట్లూర్ పీహెచ్‌సీకి డిప్యూటేషన్ చేసేందుకు ఏవో రూ.30 వేలు వసూలు చేసినట్లు తెలిసింది. ఇటీవల వచ్చిన ఆరుగురు డిప్యూటేషన్లలోనూ ఒక్కొక్కరి నుంచి రూ.50 వేల వరకు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
మరోవైపు ఇటీవల నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు ఇచ్చినట్లు తెలిసింది. ఇన్చార్జి డీఎంహెచ్‌వోగా ఉన్న సమయంలో ఓ ఆఫీస్ సబార్డినేట్‌తోపాటు రికార్డ్ అసిస్టెంట్, ఓ జూనియర్ అసిస్టెంట్‌కు కలెక్టర్ అనుమతి లేకుండానే పదోన్నతులివ్వడంపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పదోన్నతుల విషయంలోనూ ఏవో పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు.
జిల్లా వైద్యారోగ్య శాఖలో ప్రోగ్రామ్ ఆఫీసర్ పోస్టుకు రూ.లక్ష డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. పదోన్నతులపై నలుగురు డిప్యూటీ డీఎంహెచ్వోలు జిల్లాకు ఇద్దరిని డిప్యూటీ డీఎంహెచ్‌వోలుగా నియమించగా, మరో ఇద్దరిని డీఐవో, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారులుగా నియమించారు. కొత్తగా వచ్చిన డిప్యూటీ డీఎంహెచ్‌వోలకు ప్రోగ్రాం అధికారులుగా నియమించి నెల రోజులు కాకముందే గతంలో ప్రోగ్రాం అధికారులుగా పనిచేసిన మెడికల్ అధికారులతో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు బేరసారాలు చేసినట్లు తెలిసింది. ఇద్దరు మెడికల్ అధికారులను పీవోలుగా పనిచేస్తారా అంటూ డీఎంహెచ్‌వో అడగగా, మళ్లీ పీవో పోస్టు ఇవ్వాలంటే అక్షరాల రూ.లక్ష ఇవ్వాల్సిందేనంటూ ఏవో హుకూం జారీ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా డీఎంహెచ్‌వో మేడమ్ చెబితేనే బేరసారాలు చేసినట్లు మెడికల్ ఆఫీసర్లతో సదరు ఏవో చెప్పడం గమనార్హం.