మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 13న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికల పరిశీలకులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 16న సరూర్‌నగర్ స్టేడియంలో ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. నామినేషన్ల ప్రక్రియ, పరిశీలన, ఉపసంహరణ ఇప్పటికే ముగియగా 21 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిని దృష్టిలో ఉంచుకుని బ్యాలెట్ పేపర్‌ను కూడా అధికారులు సిద్ధం చేశారు. కాగా రంగారెడ్డి జిల్లాలో 9,186 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 4,870 మంది, మహిళలు 4,315 మంది, ఒకరు థర్డ్ జెండర్ ఉన్నారు. పోలింగ్ కేంద్రాలు 31 ఉన్నాయి. కందుకూరు డివిజన్లో అధికంగా 4,464 మంది ఓటర్లున్నారు.
-రంగారెడ్డి, మార్చి 5 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : ‘మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్’ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇందుకు సంబంధించి గత నెలలో నోటిఫికేషన్ జారీ అయింది. ఈ స్థానానికి ఎమ్మెల్సీగా ఉన్న కాటేపల్లి జనార్దన్‌రెడ్డి పదవీ కాలం ఈ నెల 29న ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఈ స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నెల 13న జరిగే పోలింగ్‌కు సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికల పరిశీలకులు ఆయా చర్యలు తీసుకుంటున్నారు. నామినేషన్ల ప్రక్రియ, పరిశీలన, ఉపసంహరణ తదితర అంశాలు ఇప్పటికే ముగిశాయి. బరిలో నిలిచిన 21 మంది అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని బ్యాలెట్ పేపర్‌ను ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు.
ఈ క్రమంలోనే ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను నియమిస్తూ ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 13న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ పకడ్బందీగా జరగనుంది. మార్చి 16న ఓట్ల లెక్కింపు జరిపి, అధికార యంత్రాంగం ఫలితాలు వెల్లడించనున్నారు. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఖరారు కావడంతో ఆయా పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని పోటీపోటీగా కొనసాగిస్తున్నారు. జిల్లాలో 31 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుండగా, రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ కళాశాల నుంచి బ్యాలెట్ డిస్ట్రిబ్యూషన్, 14 మార్గాల్లో బట్వాడా కొనసాగనున్నదని సమాచారం.
జిల్లాలో 9,186 మంది ఓటర్లు
ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి తుది ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం రెండు నెలల క్రితమే ఖరారు చేసింది. రంగారెడ్డి జిల్లాలో 9,186 మంది ఓటర్లకు 4,870 మంది పురుషులు, 4,315 మంది మహిళలు, ఒకరు థర్డ్ జెండర్ ఉన్నారు. 31 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 6,536 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 14 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగనుంది. కాగా, అత్యల్పంగా నారాయణపేట జిల్లాలో 688, జోగులాంబ గద్వాల జిల్లాలో 873 మంది చొప్పున ఓటర్లు ఉన్నారు.
ఆయా డివిజన్ల పరిధిలో ఓటర్లు
షాద్‌నగర్ డివిజన్ పరిధిలో 507 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 239 మంది పురుషులు, 267 మంది మహిళలు, ఒకరు థర్డ్ జెండర్ ఉన్నారు. డివిజన్లోని ఆరు మండలాలకు నాలుగు పోలింగ్ కేంద్రాల(కొత్తూరు, కొందుర్గు, కేశంపేట, ఫరూఖ్‌నగర్)ను కేటాయించారు. చేవెళ్ల డివిజన్ పరిధిలో 370 మంది ఓటర్లకు 196 మంది పురుషులు, 174 మంది మహిళలు ఉన్నారు. డివిజన్లోని నాలుగు మండలాలకు నాలుగు పోలింగ్ కేంద్రాల(షాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, మొయినాబాద్)ను కేటాయించారు. ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలో 2027 మంది ఓటర్లకు 1260 మంది పురుషులు, 767 మంది మహిళలు ఉన్నారు. డివిజన్లోని పలు మండలాలకు ఎనిమిది పోలింగ్ కేంద్రాల(యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్-2, అబ్దుల్లాపూర్‌మెట్-2, మాడ్గుల)ను కేటాయించారు.
రాజేంద్రగనగర్ డివిజన్ పరిధిలో 1818 మంది ఓటర్లకు 812 మంది పురుషులు, 1006 మంది మహిళలు ఉన్నారు. డివిజన్లోని నాలుగు మండలాలకు నాలుగు పోలింగ్ కేంద్రాల(శంషాబాద్, గండిపేట, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి)ను కేటాయించారు. కందుకూరు డివిజన్ పరిధిలో 4464 మంది ఓటర్లకు 2363 మంది పురుషులు, 2101 మంది మహిళలు ఉన్నారు. డివిజన్లోని పలు మండలాలకు పదకొండు పోలింగ్ కేంద్రా ల(ఆమనగల్లు, మహేశ్వరం, కందుకూరు, సరూర్‌నగర్-6, బాలాపూర్-2)ను కేటాయించారు. పోలింగ్ కేంద్రాలను ఆయా మండలాలు, గ్రామాలకు 16 కిలోమీటర్ల పరిధిలోనే ఉండేలా ఏర్పాటు చేశారు.
ఎలాంటి అవకతవకలు జరుగకుండా పోలింగ్ : ప్రతీక్‌జైన్, రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలో 9,186 మంది ఓటర్లు ఉన్నారు. ఓటింగ్‌లో ఎలాంటి లోటుపాట్లు, అవకతవకలు లేకుండా ఇప్పటికే ఏర్పాట్లు చేపట్టాం. ప్రిసైడింగ్ సహాయ, ప్రిసైడింగ్ అధికారులు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఎన్నికలను నిర్వహించాలని ఆదేశాలిచ్చాం. ఎన్నికకు నియమించబడిన పీవో, ఏపీవోలు ప్రతి ఎన్నికను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని, ఎన్నికల కమిషన్ నుంచి వచ్చే ఆదేశాలను క్షుణ్ణంగా చదవాలని ఆదేశించాం.
ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారులపై ఎక్కువగా బాధ్యత ఉన్నప్పటికీ, సహాయ ప్రిసైడింగ్ అధికారి కూడా అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండేలా వారిని సిద్ధం చేశాం. రెగ్యులర్ ఎన్నికల మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నికను కూడా నిర్వహించాలని అధికారులకు సూచించాం. జిల్లాలో 31 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశాం. ఏదైనా అంశం తెలియనైట్లెనా, సందిగ్ధం ఉన్నట్లయితే ఎలాంటి సంకోచం లేకుండా ముందుగానే ఆ విషయాలను అడిగి తెలుసుకోవాలని, ప్రతి విషయాన్ని ఒకటికి రెండుసార్లు సరి చూసుకోవాలని, ఎలాంటి పొరపాట్లు జరుగకుండా ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే అధికారులకు సూచించాం.