రంగారెడ్డి, జూలై 15 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ భూములను రక్షించడంలో అధికారుల జాప్యం వెనుక ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కోట్లాది రూపాయల భూములు అధికారుల అండదండలతోనే అన్యాకాంత్ర మవుతున్నాయని ఆరోపిస్తున్నారు. రూ.200 కోట్ల విలువ చేసే అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని మునుగనూరులోని సర్వేనంబర్ 44లో ఉన్న 12 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా గత తహసీల్దార్ ఇతరులకు పట్టా చేసిన విషయం పత్రికల్లో రావడంతో ప్రభుత్వ యంత్రాంగం హడావుడి చేసి వదిలేసింది. మునుగనూరు ప్రభుత్వ భూమి కబ్జాపై పూర్తిస్థాయి నివేదిక తెప్పించుకుని వారం రోజుల్లో స్వాధీనం చేసుకుని కంచె వేస్తామని ప్రకటించిన అధికారులు ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ భూ మి నేటికీ ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోనే ఉన్న ది.
రెవెన్యూ అధికారులు ఆ భూమిని స్వా ధీనం చేసుకునేందుకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. అలాగే, అదే మండలంలో రూ.10 కోట్ల విలువ చేసే రాగన్నగూడలోని సర్వేనంబర్ 41లో ఉన్న 1.26 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా అన్యాక్రాంతమైంది. ఈ భూమి కబ్జా విషయమూ పత్రికల్లో రాగా.. హడావుడిగా అధికారులు అక్కడికెళ్లి షెడ్లను తొలగించి, మిగతా నిర్మాణాల జోలికి వెళ్లలేదు.
అక్రమ నిర్మాణదారులకు నోటీసు లిస్తామని చెప్పినా ఇప్పటికీ ఇవ్వనేలేదు. అలాగే, అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని పిగ్లీపూర్ గ్రామంలో నూ వందల ఎకరాల ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా కబ్జాచేసి ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. ఈ భూమి నిషేధిత జాబితాలో ఉన్నా అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారు. దీనిపై అధికారులు నోరు మెదపటంలేదు. ఈ భూ మినీ స్వాధీనం చేసుకోవటంలో అధికారులు చేస్తున్న జాప్యంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలున్నాయి.