ఆరోగ్య తెలంగాణ కోసం రాష్ట్ర సర్కార్ అహర్నిశలు కృషి చేస్తున్నది. గర్భిణుల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు న్యూట్రిషన్ కిట్స్‌ను అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాలను ఎంపిక చేయగా, అందులో వికారాబాద్ జిల్లా ఉండడం గమనార్హం. పంపిణీని డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో కిట్‌లో కిలో ప్రొటీన్ పౌడర్ ప్యాకెట్, 3 ఐరన్ సిరప్లు, ఖర్జూరం ప్యాకెట్, నెయ్యి ప్యాకెట్, ఒక ఆల్బెండజోల్ ట్యాబ్లెట్, ఒక కప్పు సైతం ఉంటాయి. జిల్లాలో 25 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 154 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉండగా, వీటి పరిధిల్లో ఎంత మంది గర్భిణులు ఉన్నారో తెలుసుకుని న్యూట్రిషన్ కిట్స్‌ను అందించేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నారు. 13 నుంచి 27 వారాల గర్భిణులకు మొదటి న్యూట్రిషన్ కిట్, 28 నుంచి 34 వారాల గర్భిణులకు రెండో కిట్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 5వేలకుపైగా గర్భిణులకు కిట్స్ అందజేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
పరిగి, నవంబర్ 29 : గర్భిణుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపం నివారించడానికి ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్స్ అందించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాల్లో న్యూట్రిషన కిట్స్ పంపిణీని డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు. వికారాబాద్ జిల్లాలో కూడా గర్భిణులకు న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి జిల్లావ్యాప్తంగా ఎంతమంది గర్భిణులు ఉన్నారు, వారికి ఎలా పంపిణీ చేయాలనే అంశంపై అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 5వేలకు పైగా గర్భిణులకు న్యూట్రిషన్ కిట్స్ అందించనున్నారు. ఇందుకు సంబంధించిన గణాంకాలు చేపడుతున్నారు.
జిల్లాలో 5వేలమందికి పైగా..
పౌష్టికాహారంతోపాటు రక్తహీనత సమస్యకు చరమగీతం పాడేందుకు ప్రభుత్వం గర్భిణులకు న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ చేపట్టనుండగా.. వికారాబాద్ జిల్లాలో 5వేలకు పైగా గర్భిణులకు కిట్స్ అందజేయనున్నారు. జిల్లాలో 25 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుండగా.. ఒక్కో పీహెచ్సీ నుంచి సుమారు 200 మంది కిట్స్ అందుకోనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో 154 ఆరోగ్య ఉప కేంద్రాలున్నాయి. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆరోగ్య ఉప కేంద్రం వారికి కిట్స్ అందజేసేలా ఏర్పాట్లు చేపడుతున్నారు. 13 నుంచి 27 వారాల గర్భిణులకు మొదటి కిట్, 28 నుంచి 34 వారాల గర్భిణులకు రెండో న్యూట్రిషన్ కిట్ అందిస్తారు. మొదటి కిట్ అందించిన నెల రోజులకు రెండో కిట్ పంపిణీ చేస్తారు. ఇందులో భాగంగా ప్రతి ఆరోగ్య ఉప కేంద్రం పరిధిలో 13 నుంచి 27 వారాల గర్భిణులు, 28 నుంచి 34 వారాల గర్భిణులు ఎంత మంది ఉన్నారన్నది పక్కాగా లెక్కలు తీస్తున్నారు. తద్వారా ప్రతి ఒక్కరికి కిట్స్ అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
న్యూట్రిషన్ కిట్‌లో..
ప్రభుత్వం గర్భిణులకు అందజేసే న్యూట్రిషన్ కిట్స్‌లో ఒక కిలో ప్రొటీన్ పౌడర్ ప్యాకెట్, 3 ఐరన్ సిరప్లు, ఒక ఖర్జూరం ప్యాకెట్, ఒక నెయ్యి ప్యాకెట్, ఒక ఆల్బెండజోల్ ట్యాబ్లెట్, ఒక కప్పు కూడా ఉంటాయి. ప్రొటీన్ పౌడర్ కలుపుకొని తాగేందుకు వీలుగా ఈ కప్‌ను అందించనున్నారు. రక్తహీనత సమస్య అధికంగా ఉన్న జిల్లాల్లో ఈ కిట్స్ పంపిణీ చేపడుతుండడం ద్వారా సమస్యను పూర్తిస్థాయిలో నివారించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. చక్కటి పౌష్టికాహారం అందేలా ప్రొటీన్ పౌడర్ దోహదం చేస్తుందని తెలిపారు. తద్వారా గర్భిణులకు పౌష్టికాహారం అందడంతోపాటు పుట్టబోయే శిశువులకు మరింత మేలు చేకూరుస్తుందంటున్నారు.
న్యూట్రిషన్ కిట్స్ పంపిణీకి ఏర్పాట్లు
– డాక్టర్ లలిత, ప్రోగ్రామ్ ఆఫీసర్, మాతాశిశు సంరక్షణ
ప్రభుత్వం గర్భిణులకు న్యూట్రిషన్ కిట్స్ అందించేందుకు నిర్ణయించడంతో వికారాబాద్ జిల్లా పరిధిలోని గర్భిణులకు కిట్స్ పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలో 13 వారాల నుంచి 27 వారాలు, 28 నుంచి 34 వారాల గర్భిణుల వివరాలు సేకరించనున్నాం. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో సుమారు 200 మందికి పైగా కిట్స్ అందనున్నాయి. 13 నుంచి 27 వారాల గర్భిణులకు మొదటి కిట్, 28 నుంచి 34 వారాల గర్భిణికి రెండో కిట్ అందిస్తారు.