మొయినాబాద్, నవంబర్ 6 : హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై గత పదేండ్ల నుంచి వాహనాల రద్దీ పెరుగుతున్నది. రోడ్డు చిన్నగా ఉండడంతో వాహనాలు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుంటున్నాయి. రహదారి గతుకులమయంగా మారి తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు, వాహనచోదకులు మండిపడుతున్నారు. గతేడాది చేవెళ్ల మండలంలోని ఆలూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి చెందినప్పుడు అధికారు లు, ప్రజాప్రతినిధులు హడావుడి చేశారు. రోడ్డుకు ఇరువైపులా మట్టి పోసి గుంతల్లో సిమెంట్, కాంక్రీట్ పోసి చేతులు దులుపుకొన్నారు.
కాగా, రోడ్డుపై పూడ్చిన గుంత ల్లో మళ్లీ గోతులు ఏర్పడ్డాయి. తదనంతరం అనేక ప్రమాదాలు జరిగినా అధికారు లు పట్టించుకోదు. కానీ, ఇటీవల మీర్జాగూడ వద్ద జరిగిన ప్రమాదంలో 19 మంది మృతి చెందడంతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఘటనాస్థలికి చేరుకుని హడావుడి చేశారు. రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చడం, రోడ్డు పక్కన మట్టి పోసి చదును చేసే తాత్కాలిక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. ప్రజల ప్రాణాలు పోతేకాని.. అధికారులు పట్టించుకోరా..? అని స్థానికులు మండిపడుతున్నారు. అధికారు లు మొద్దునిద్రను వీడి..హైదరాబాద్-బీజాపూర్ హైవేను నాలుగు లేన్లుగా విస్తరించాలని డిమాండ్ చేస్తున్నారు.