ఇబ్రహీంపట్నం, నవంబర్ 21 : ఎన్ని జిమ్మిక్కులు చేసినా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఇబ్రహీంపట్నంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాలకు చెందిన పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంచిరెడ్డి మాట్లాడుతూ…అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన దాదాపుగా రెండేండ్లు గడుస్తున్నా ఒక్క హామీని కూడా రేవంత్ సర్కార్ నెరవేర్చకపోవడంతో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మడం లేదన్నారు. ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించి.. ఇప్పుడు అన్ని వర్గాలను మోసం చేస్తున్నదని మండిపడ్డారు.
ఎవరెన్నీ కుట్రలు చేసినా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధిక సీట్లను సాధిస్తుందని.. అందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో రంగారెడ్డి గ్రంథాలయ సంస్థ మాజీ జిల్లా చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ రాజేందర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కిషన్‌గౌడ్, బుగ్గరాములు, రమేశ్, కార్యదర్శులు బహదూర్, భాస్కర్‌రెడ్డి, భీమ్యాదవ్ తదితరులున్నారు.