వికారాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్భాటం తప్ప ఏ ఒక్క నిర్ణయయూ అమలుకు నోచుకోవడంలేదు. రుణమాఫీ విషయంలో రైతులకిచ్చిన హామీ మేరకు చేయకుండానే పూర్తి చేశామంటూ ప్రచారం చేసుకోవడం తప్ప అర్హులుగా గుర్తించిన వారికి అన్యాయం చేస్తున్నది. ఎన్నికలకు ముందు ఒకే దఫాలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులను పరిగణనలోకి తీసుకోవడం తదితర కొర్రీలు పెట్టి అర్హులైన పేద అన్నదాతలకు రుణమాఫీ వర్తించకుండా రేవంత్ సర్కార్ దూరం చేసింది. రూ.2 లక్షలలోపు రుణాలను మాఫీ చేశామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది కానీ వాస్తవానికి ఇంకా రూ.2 లక్షలలోపు రుణమాఫీ పూర్తికాలేదు.
రుణమాఫీ ప్రక్రియను మొదలుపెట్టి సంవత్సరం కావొస్తున్నా ఇప్పటివరకు అర్హులైన రైతులకు సంబంధించిన పంట రుణాలను మాఫీ చేయలేదు. గతేడాదిగా తమ రుణాలను ఎప్పుడు మాఫీ చేస్తారంటూ జిల్లా కలెక్టరేట్‌తోపాటు వ్యవసాయాధికారి కార్యాలయాల చుట్టూ అన్నదాతలు ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ఎన్నికలకు ముందు రూ.2 లక్షలలోపు రుణాలను మాఫీ చేస్తామని హామీనిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వడ్డీని కూడా పరిగణనలోకి తీసుకొని రైతులను మోసం చేసింది.
రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకోవడంతోనే..
కాంగ్రెస్ సర్కారు గతేడాది ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించి, ఏడాదిన్నర దాటినా ఇంకా రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయలేదు. జిల్లాలో రూ.2 లక్షలలోపు పంట రుణాల మాఫీకి సంబంధించి 1,00,828 మంది అన్నదాతలకు సంబంధించిన రూ.849 కోట్ల రుణాలను మాఫీ చేసింది. మరోవైపు జిల్లావ్యాప్తంగా 2.50 లక్షల మంది రైతులుండగా.. సుమారు 2 లక్షల మంది అన్నదాతలు పంట రుణాలు తీసుకుంటే..
వీరిలో కేవలం 1.01 లక్షల మంది రైతులను మాత్రమే రూ.2 లక్షలలోపు రుణమాఫీకి అర్హులని తప్పుడు లెక్కలు చూపించిందని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. రూ.2 లక్షలలోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు సంబంధించి 1.50 లక్షల మందికిపైగా అన్నదాతలున్నప్పటికీ ఏదో ఒక కొర్రీ పెట్టి రుణమాఫీ చేయకుండా ఆపినట్లు అర్హులైన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టాదారు పాసుపుస్తకాలను పరిగణనలోకి తీసుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్షలోపు పంట రుణాలను మాఫీ చేస్తే.. కాంగ్రెస్ సర్కారు రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకోవడంతోనే సుమారు 50 వేల మంది అన్నదాతలు నష్టపోయారని సమాచారం. రేషన్ కార్డు లేదనే మెలిక పెట్టిన ప్రభుత్వం తదనంతరం రేషన్ కార్డులు జారీ చేసినా వారి రుణాలను మాఫీ చేయకుండా విస్మరిస్తుండడం గమనార్హం.
రూ.2 లక్షలపైన ఉన్న రుణాల మాఫీపై స్పష్టత కరువు
పంట రుణాల మాఫీకి సంబంధించి రూ.2 లక్షలపైన(వడ్డీతో కలిపి) ఉన్న మొత్తాన్ని జిల్లా వ్యవసాయాధికారులు తెలిపిన తేదీలోగా చెల్లించినా ఇప్పటివరకు సర్కారు నుంచి ఎలాంటి స్పష్టత లేకపోవడం గమనార్హం. అధికారుల మాట విని జిల్లాలో రూ.2 లక్షలపైన రుణాలున్న సుమారు 2 వేల మంది రైతులు కటాఫ్‌కు పైన ఉన్న రుణ మొత్తాన్ని చెల్లించారు. కటాఫ్ రుణానికి మించి ఉన్న అన్నదాతల్లో చాలా మంది ఇప్పటికే పైన ఉన్న రుణాలను చెల్లించి సంబంధిత రశీదులను వ్యవసాయాధికారులకు అందజేసినప్పటికీ ఎలాంటి స్పష్టత లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కటాఫ్ రుణానికి మించి ఉన్న రుణాలను చెల్లిస్తేనే మాఫీ అవుతుందని వ్యవసాయాధికారులు చెప్పడంతో చెల్లించి, రశీదులు అందజేశామని, ఎప్పుడు మాఫీ అవుతుందని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు రుణాలను మాఫీ చేస్తున్నామంటూనే తిరిగి రైతుల నుంచి ముక్కు పిండి వసూలు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికలకు ముందు ప్రగల్భాలు పలికి ఇప్పుడు నట్టేట ముంచుతుండడంపై అన్నదాతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మాట మార్చిన సర్కారు
రుణమాఫీ ప్రక్రియ మొదలైనప్పుడు రూ.2 లక్షలలోపు రుణాలన్నింటిని మాఫీ చేస్తామని చెప్తూ వచ్చి, రైతులు రూ.2 లక్షలపైన ఉన్న మొత్తాన్ని చెల్లించిన తర్వాత ప్రభుత్వం మాట మార్చింది. కేవలం రూ.2 లక్షలలోపు రుణాలను మాఫీ చేస్తామని హామీనిచ్చి, అన్నదాతలు తీసుకున్న పంట రుణాలతోపాటు ఆ రుణాలకు అయిన వడ్డీని కలిపి రూ.2 లక్షల వరకు మాఫీ చేసింది. రైతులకు ఒక హామీనిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేయడంపై అన్నదాతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చాలా మంది రైతులకు అన్యాయం జరిగింది. రూ.1.50 లక్షల రుణాలు తీసుకున్న వడ్డీతో కలిపి రూ.2 లక్షలు అయితే మాత్రమే రుణమాఫీకి అర్హులుగా పరిగణనలోకి తీసుకున్నారు.
మరోవైపు రుణాలు రూ.2 లక్షల పైచిలుకు ఉన్న అన్నదాతలు మిగతా రుణాలను చెల్లించేందుకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించారు. రూ.2 లక్షలపైన ఉన్న రుణాలను ఆగస్టు 15లోపు రుణాలను చెల్లించకపోతే రుణమాఫీ వర్తించదని సంబంధిత అధికారులు స్పష్టం చేయడంతో చాలా మంది రైతులు రూ.2 లక్షలపైన ఉన్న మొత్తాన్ని చెల్లించారు. మరోవైపు జిల్లావ్యాప్తంగా గ్రీవెన్స్‌కు సంబంధించి దాదాపు 30 వేల వరకు అన్నదాతలు రుణమాఫీ కాలేదని ఫిర్యాదు చేశారు. అత్యధికంగా రేషన్ కార్డు లేకపోవడంతోనే రుణమాఫీ కాలేదని సర్వేలో స్పష్టమైంది. జిల్లావ్యాప్తంగా 18,431 మంది రైతులకు రేషన్ కార్డు లేకపోవడంతోనే రుణమాఫీ కాలేదని వ్యవసాయాధికారులకు వచ్చిన ఫిర్యాదులతో తేటతెల్లమైంది. అత్యధికంగా నవాబుపేట్ మండలంలో రెండు వేల మందికిపైగా అన్నదాతలు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం రేషన్ కార్డులు జారీ చేసినా.. సంబంధిత రైతుల రుణాల మాఫీపై మాత్రం కాంగ్రెస్ సర్కారు పట్టనట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం.
ఏడాదిగా ప్రదక్షిణలు చేస్తున్నా..
రుణమాఫీ కోసం ఏడాదిగా వ్యవసాయ కార్యాలయాల చుట్టూ, కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాను. స్థానిక వ్యవసాయాధికారితోపాటు జిల్లా వ్యవసాయాధికారికి ప్రతీ సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం అందజేస్తున్నప్పటికీ ఎలాంటి స్పందన లేదు. నా పేరిట వడ్డీతో కలిపి 1.32 లక్షల రుణాలు మాత్రమే ఉన్నప్పటికీ రుణమాఫీ చేయలేదన్నారు. వ్యవసాయాధికారులు మరొకరి పేరిట ఉన్న రూ.82 వేల పంట రుణాలను నా పేరిట కలిపి రూ.2 లక్షలపైన రుణాలున్నాయనే కారణంతో రుణమాఫీ పూర్తి చేయలేదు. అధికారులు చేసిన తప్పిదంతో రుణాలను మాఫీ చేయకుండా తిప్పుతున్నారు. రుణమాఫీ ప్రక్రియ షురూ అయినప్పటి నుంచి అధికారులకు వారు చేసిన తప్పిదాన్ని చెబుతున్నా.. పట్టించుకోకుండా పరిష్కరించకుండా పెండింగ్‌లో పెట్టారు.
– కమాల్ రెడ్డి, హరిదాసుపల్లి, ధారూర్ మండలం