వికారాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : రీజినల్ రింగ్ రోడ్డు కొత్త అలైన్‌మెంట్‌కు వ్యతిరేకంగా జిల్లాలో రైతులు ఉద్యమిస్తున్నారు. గత వారం రోజులుగా జిల్లా కలెక్టరేట్‌తోపాటు హైదరాబాద్‌లోని హెచ్ఎండీఏ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేస్తున్నారు. రోజుకొక్క మండలానికి చెందిన రైతులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్నారు. ప్రభుత్వం కేసులు పెట్టి జైలుకు పంపించినా ఎట్టిపరిస్థితుల్లోనూ ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూములను ఇచ్చేది లేదని అన్నదాతలు స్పష్టం చేస్తున్నారు. పాత అలైన్మెంట్ ప్రకారం రీజినల్ రింగ్‌రోడ్డును చేపట్టాలని, పాత అలైన్మెంట్ ప్రకారం రీజినల్ రింగ్ రోడ్డు చేపడితే ఎక్కువగా అసైన్డ్ భూములున్నాయి కాబట్టి నష్టం జరగదని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు స్వప్రయోజనాల కోసం రీజినల్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్పు చేశారని, బడా నేతలకు లబ్ధి చేకూరేలా, పేద అన్నదాతలకు అన్యాయం జరిగేలా రీజినల్ రింగ్‌రోడ్డు కొత్త అలైన్మెంట్ ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. వందల ఎకరాల భూస్వాముల కోసం ఎకరా, రెండెకరాలలోపు భూములున్న అన్నదాతలను రోడ్డున పడేసేలా కాంగ్రెస్ సర్కారు ముందుకెళ్తుండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రీజినల్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ ప్రతిపాదనలో జిల్లాలోని నాలుగు మండలాల్లోని 22 గ్రామాల మీదుగా సర్వే నంబర్లతో సహా నోటిఫికేషన్ జారీ చేయడంతో జిల్లాలోని పూడూరు మండలంలోని 11 గ్రామాల రైతులతోపాటు మోమిన్‌పేట్ మండలం దేవరంపల్లి, నవాబుపేట్ మండలం చిట్టిగిద్ద, చించల్పేట్ గ్రామ అన్నదాతలు తమ పట్టా భూములను కోల్పోవాల్సి వస్తుందని, ప్రభుత్వ, అసైన్డ్ భూముల మీదుగా ప్రతిపాదనలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
రీజినల్ రింగ్‌రోడ్డు కొత్త అలైన్‌మెంట్‌కు వ్యతిరేకంగా గురువారం జిల్లా కలెక్టరేట్ వద్ద నవాబుపేట్ మండలం చించల్పేట్ గ్రామ రైతులు ధర్నా చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి మంగీలాల్‌కు వినతిపత్రం అందజేసిన అనంతరం పాత అలైన్మెంట్ ప్రకారం రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించాలని, కొత్త అలైన్మెంట్ వద్దే వద్దంటూ అన్నదాతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎన్నో ఏండ్ల నుంచి సాగు చేసుకుంటూ బతుకుతున్న తమ పట్టా భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని రైతులు స్పష్టం చేశారు. సర్కారు బలవంతంగా భూములను లాక్కుంటే కలెక్టరేట్ ఎదుట పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రీజినల్ రింగ్‌రోడ్డు మాకొద్దు.. మా బతుకులను ఆగం చేయొద్దంటూ సర్కారును కోరారు. ఉన్న ఒకట్రెండు ఎకరాల భూమి కూడా రీజినల్ రింగ్‌రోడ్డులో కోల్పోతే తమ బతుకులు ఆగం అవుతాయని, రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు. ట్రిపుల్ కొత్త అలైన్మెంట్ పరిధిలోని గ్రామాల్లో భూముల ధరలు ఎకరం రూ.కోట్లలో ఉండడం, ఒకవేళ రీజినల్ రింగ్‌రోడ్డులో భూములు కోల్పోతే ప్రభుత్వం అందజేసే అరకొర సాయంతో నష్టపోతామని.. ఎట్టి పరిస్థితుల్లోనూ రీజినల్ రింగ్‌రోడ్డుకు భూములిచ్చేది లేదని స్పష్టం చేస్తున్నారు. రైతే రాజు అంటూ తబకు జీవనాధారమైన భూములను లాక్కుంటే ఎట్లా బతుకుతామంటూ చించల్పేట్ రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమ కుటుంబం అంతా కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యలు చేసుకుంటాం కానీ భూములు మాత్రం ఇవ్వబోమని స్పష్టం చేస్తున్నారు. రీజినల్ రింగ్‌రోడ్డుకు ప్రతిపాదించిన కొత్త అలైన్మెంట్లో చాలా వరకు పట్టా భూముల మీదుగా అలైన్‌మెంట్‌ను రూపొందించడంతో భూములు కోల్పోతున్న రైతులు జిల్లా ఉన్నతాధికారులు, హెచ్ఎండీఏ అధికారులతోపాటు ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లి తమకు న్యాయం చేయాలంటూ విన్నవిస్తున్నారు.
పాత అలైన్మెంట్ ప్రకారమే రీజినల్ రింగ్‌రోడ్డును చేపట్టాలి. పాత అలైన్మెంట్ ప్రకారం వెంచర్లు, అసైన్డ్ భూముల మీదుగా వెళ్లేది కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కుమ్మక్కై పేద రైతుల పొట్టకొడుతున్నారు. 20-30 గుంటల భూమున్న రైతులను భూములను ప్రభుత్వం లాక్కునేందుకు కొత్త అలైన్‌మెంట్‌ను తీసుకువచ్చింది. ప్రభుత్వం కొత్త అలైన్‌మెంట్‌ను వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తాం.
– శాంతకుమార్, చిట్టిగిద్ద, నవాబుపేట్ మండలం
ఆమనగల్లు(మాడ్గుల) : ప్రాణం పోయినా ట్రిపుల్ఆర్కు తమ భూములిచ్చేది లేదని నినదించారు. మాడ్గుల మండల పరిధిలోని అన్నెబోయిన్పల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాలకు చెందిన ట్రిపుల్‌ఆర్‌లో భూములు కోల్పోనున్న రైతులు గురువారం పెద్దఎత్తున మాడ్గులలోని ప్రధాన రహదారి వద్దకు చేరుకుని వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రోడ్డుపై బైఠాయించి ‘మాకొద్దు ఈ ట్రిపుల్ఆర్ రోడ్డు, ట్రిపుల్ఆర్ నుంచి మా భూములను రక్షించండి, మా భూములిచ్చేది లేదు’ అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. బడాబాబుల భూములను కాపాడేందుకు చిన్న, సన్నకారు రైతుల భూముల్లోంచి ట్రిపుల్ఆర్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నారన్నారు. తమకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం, పశుపోషణ చేసుకుంటూ జీవనం వెళ్లదీస్తున్నామని, ఆ భూములు పోతే తామెలా బతకడమని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే నూతన ఆలైన్‌మెంట్‌ను మార్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వెంకటయ్య ఉన్నారు.