ముంబై, ఫిబ్రవరి 20 : దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్‌పడింది. బ్యాంకింగ్, మెటల్ రంగ షేర్లలో కొనుగోళ్లు పోటెత్తడంతోపాటు వాణిజ్య ఒప్పందం కుదరడం కూడా సూచీల్లో జోష్ పెంచింది. ఒకవైపు, అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా వారాంతపు ట్రేడింగ్ ఇంట్రాడేలో 600 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 83 వేల పాయింట్ల పైకి చేరుకున్నది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 316.57 పాయింట్లు అందుకొని 82,814.71 పాయింట్ల వద్ద స్థిరపడింది.
మరో సూచీ నిఫ్టీ 116.90 పాయింట్లు ఎగబాకి 25,571.25 వద్ద ముగిసింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.1,89,341.06 కోట్లు పెరిగి రూ.4,67,11,355.63 కోట్లు(5.14 ట్రిలియన్ డాలర్లు)కు చేరుకున్నది. గురువారం ఇరు సూచీలు ఒక్క శాతానికి పైగా నష్టపోయిన విషయం తెలిసిందే. భారీ కరెక్షన్కు గురైన దేశీయ ఈక్విటీ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి రాగలిగాయి..మదుపరులు లార్జ్‌క్యాప్ షేర్లకు మొగ్గుచూపడం, వాణిజ్య ఒప్పందాలు కుదరడం కూడా సెంటిమెంట్‌ను మెరుగుపరిచిందని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ రీసర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
పలు దేశాలను టారిఫ్‌లతో బెంబేలెత్తించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు అమెరికా సుప్రీంకోర్టు గట్టి షాకిచ్చింది. ఆయన విధించిన టారిఫ్‌లు చట్టవిరుద్ధమైనవిగా పేర్కొంటూ కోర్టు తీర్పు వెలువరించింది. . ఈ నిర్ణయంతో అక్కడి స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. నాస్డాక్, డౌజోన్స్, ఎస్అండ్పీ 500 సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా భారీగా లాభపడే అవకాశాలున్నాయని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. శని, ఆదివారాల్లో స్టాక్ మార్కెట్లకు సెలవు కావడంతో సోమవారం సూచీలు భారీగా పుంజుకునే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.