మా ఆవేశాన్ని కొంతమంది రాజకీయం చేశారని.. మేము అధికారులను కావాలని అడ్డుకోకున్నా.. దానికి రాజకీయ రంగు పులిమారారని ఫార్మా భూబాధిత కుటుంబాలు కన్నీటి పర్యంతమయ్యాయి. తమపై ఈ నెల 11న అర్ధరాత్రి సమయంలో ప్రభుత్వం దాష్టీకానికి పాల్పడిందని భోరున విలపించారు. వందలాదిగా వచ్చిన పోలీసులు కరెంట్ సరఫరా తీసేసి.. ఇల్లిల్లూ జల్లెడ పట్టి.. దొరికిన వారిని దొరికినట్లు వ్యాన్లలో కుక్కారని.. మహిళలపై దురుసుగా ప్రవర్తించారని.. వృద్ధులు, చిన్నారులు అని కూడా చూడకుండా వారిపై దాడి చేశారని.. అమయకులనూ అక్రమంగా అరెస్టు చేశారని ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులకు వివరించారు. గత 12 రోజులుగా భయం.. భయంగా..బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నామని.. ఎప్పుడు ఎవరు వస్తారో.. మళ్లీ ఏం జరుగుతుందోనని తిండి, నిద్రా లేకుండా ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని జీవిస్తున్నామన్నారు. తమకు న్యాయం చేసి, ఇతర ప్రాంతాలకెళ్లిన రైతులు, కుమారులను ఇండ్లకు రప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఫార్మా విలేజ్ ఏర్పాటుకు ప్రాణాలు పోయినా తమ భూములను ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.
-కొడంగల్, నవంబర్ 23
లగచర్ల ఘటనపై శనివారం జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు విచారించారు. ఫార్మా బాధిత రైతులు ఢిల్లీకెళ్లి తమకు న్యాయం చేయాలని జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయగా.. కమిషన్ సూచనల మేరకు డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ లా ముకేశ్, ఇన్స్పెక్టర్లు రోహింత్సింగ్, యతీప్రకాశ్శర్మ బాధిత గ్రామాలను సందర్శించి.. రైతు కుటుంబాలను కలిసి వివరాలు సేకరించారు. ఈ నెల 11న జరిగిన ఘటన, అనంతరం జరిగిన పరిణామాలు, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఒక్కొక్కరిని అడిగి వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు.
ఫార్మా విలేజ్ ఏర్పాటుకు భూములిచ్చే ప్రసక్తి లేదని వారు స్పష్టం చేశారు. మాకు భూమే ఆధారమని అది లేకుండా మా బతుకులు శూన్యమన్నారు. పంటల సాగు కోసం బ్యాంకుల్లో అప్పుల కోసం వెళ్తే అక్కడి అధికారులు మీకు రుణాలు ఇవ్వబోమని.. మీ భూములు ఫార్మావిలేజ్ ఏర్పాటులో పోతున్నాయని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టు అయిన రైతులు, యువకులను విడిపించాలని, మా భూములను కాపాడాలని కమిషన్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. కాగా అధికారులకు ఎదురు తిరిగిన వారిలో కొందరు పరారీలో ఉన్నారని.. వారందరూ వచ్చి పోలీసుల ఎదుట, కోర్టుల్లో లొంగిపోతే బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందని పోలీసులు తండాల్లోని మహిళలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, డీటీడబ్ల్యూ కమాలాకర్రెడ్డి, దుద్యాల తహసీల్దార్ కిషన్ పాల్గొన్నారు.