వికారాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ) : మూడు తరాల నుంచి కబ్జాలో ఉండి సాగు చేసుకుంటున్న భూమిని బోగస్ డాక్యుమెంట్లతో మ్యుటేషన్లు, సక్సెషన్లు చేసుకుంటూ నిజమైన రైతును ఆగం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో ఇలాంటి ఘటనే జరిగింది. మర్పల్లి మండలం పంచలింగాల్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 28లో 10 ఎకరాలకు భూమాయ జరిగింది. సంబంధిత పదెకరాల భూమికి సర్వ హక్కులు(ఓఆర్సీ) పొందిన కబ్జాదారుల నుంచి భూమిని సొంతం చేసుకునేందుకు కొందరు అక్రమార్కులు ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. రికార్డుల ప్రకారం గత 75 ఏళ్లుగా కబ్జాలో ఉన్న అమాయక రైతులను ఆగం చేసి రూ.10 కోట్ల విలువైన భూమిని కాజేసేందుకు రెవెన్యూ అధికారులతో కలిసి అక్రమార్కులు తతంగం జరిపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి బలం చేకూర్చే విధంగా ఓఆర్సీ పొందిన కబ్జాదారు తమ పేరిట పట్టాదారు పాసు పుస్తకం పొందేందుకు చేసుకున్న దరఖాస్తును దరఖాస్తుదారుడికి తెలియకుండానే రద్దు చేయడంపై అనుమానాలకు తావిస్తున్నది. అయితే దరఖాస్తుదారుడి ప్రమేయం లేకుండా అప్లికేషన్ రద్దు కావడంపై సీరియస్ అయిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అసలేం జరుగుతుందనే దానిపై పూర్తి విచారణకు ఆదేశించారు.
మర్పల్లి మండలం పంచలింగాల్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 28లో 10 ఎకరాల ఇనామ్ భూమిని నెల్లి అంజమ్మ కుటుంబం సాదా బైనామా ద్వారా దేశ్‌ముఖ్‌ల నుంచి కొనుగోలు చేశారు. తదనంతరం గత వందేళ్లుగా కబ్జాలో ఉంటూ సాగు చేసుకుంటున్నారు. అయితే 1950 నుంచి నిన్న, మొన్నటి వరకు నెల్లి అంజమ్మ కుటుంబ సభ్యులే కబ్జాలో ఉండడంతోపాటు సాగు చేసుకుంటున్నారు. రికార్డులను రెవెన్యూ అధికారులు మార్పులు, చేర్పులు చేయకపోవడంతో పట్టాదారు పేరు దేశ్‌ముఖ్ పేరిట ఉండగా, అనుభవదారు కాలమ్‌లో మాత్రం నెల్లి లింగన్న తదనంతరం నెల్లి బుచ్చప్ప, నెల్లి అంజయ్య, ప్రస్తుతం అంజయ్య భార్య నెల్లి అంజమ్మ పేరిట రికార్డులో పొందుపర్చారు. ఇనామ్ భూమిని కొనుగోలు చేసి అనుభవదారులుగా ఉన్న నెల్లి అంజమ్మ కుటుంబం ఓఆర్సీకి దరఖాస్తు చేసుకోగా, పూర్తి విచారణ చేసిన రెవెన్యూ అధికారులు కబ్జాలో ఉండడం, సాదా బైనామా కింద కొనుగోలు చేయడంతో నెల్లి అంజమ్మ పేరిట 2023లో వికారాబాద్ ఆర్డీవో విజయకుమారి ఓఆర్సీ జారీ చేశారు. ఓఆర్సీతో పూర్తి హక్కులు పొందిన నెల్లి అంజమ్మ తమ పేరిట పట్టాదారు పాసు పుస్తకం జారీ కోసం ధరణిలో టీఎం-33 కింద జనవరి 28, 2023న దరఖాస్తు చేసుకున్నారు. తదనంతరం ఏడాదిన్నర కాలంగా నెల్లి అంజమ్మ కుటుంబ సభ్యులు తహసీల్దార్ కార్యాలయం, కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేసినా దరఖాస్తును పరిష్కరించలేదు. ధరణి మాడ్యుల్ మారుతుందంటూ, మీ భూమి కాదంటూ మరొకరు ఫిర్యాదు చేశారంటూ తహసీల్దార్ కాలయాపన చేస్తూ వచ్చారు.
పంచాలింగాల్లోని 10 ఎకరాల ఇనాం భూమిని ఓఆర్సీ పొందిన నెల్లి అంజమ్మ తమ పేరిట పట్టాదారు పాసు పుస్తకం కోసం చేసుకున్న దరఖాస్తు వారి ప్రమేయం లేకుండా రద్దు కావడం జిల్లా అంతటా చర్చ జరుగుతున్నది. పట్టాదారు పాసు పుస్తకం జారీ కోసం ధరణిలో టీఎం-33 కింద జనవరి 28, 2023న నెల్లి అంజమ్మ కుమారుడు ప్రభాకర్ మోమిన్‌పేట మండలంలోని మేకవనంపల్లి మీసేవలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే జూలై 3న నెల్లి అంజమ్మ పేరిట చేసుకున్న దరఖాస్తు అకస్మాత్తుగా క్యాన్సిల్ అయ్యింది. ఎప్పటికప్పుడు అప్డేట్ చూసుకొని నెల్లి అంజమ్మ కుటుంబ సభ్యులు తమ అప్లికేషన్ రద్దుపై తహసీల్దార్‌ను అడిగి తెలుసుకున్నారు. తమకేం తెలియదంటూ, మేం అప్లికేషన్‌ను రద్దు చేయలేమని తహసీల్దార్ తెలపడంతో ఆందోళన పడడం దరఖాస్తుదారుల వంతైంది. విషయం జిల్లా కలెక్టర్ వద్దకు చేరడంతో దరఖాస్తుదారుడి ప్రమేయం లేకుండా అప్లికేషన్ రద్దు కావడంపై సీరియస్ అయిన కలెక్టర్ వెంటనే పూర్తి విచారణ జరిపి సంబంధిత భూమికి సంబంధించిన పూర్తి విచారణకు ఆదేశించారు.
ఇదే విషయమై ఈడీఎం మహమూద్‌ను సంప్రదించగా దరఖాస్తుదారుడే సిటిజన్ లాగిన్‌లో ఓటీపీ ద్వారా అప్లికేషన్‌ను రద్దు చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే దరఖాస్తుదారులు మాత్రం మాకు ఎలాంటి ఓటీపీ రాలేదని, మేం రద్దు చేసుకోలేదని చెబుతున్నారు. మరి అప్లికేషన్ రద్దు ఎవరు చేశారంటూ మర్పల్లి మండలంతోపాటు కలెక్టరేట్లో చర్చ జరిగింది.
నెల్లి అంజమ్మ పేరిట చేసుకున్న టీఎం-33(పేరు మార్పు) దరఖాస్తు రద్దు అయిన వెంటనే సక్సెషన్ దరఖాస్తు ప్రత్యక్షం కావడం గమనార్హం. దేశముఖ్‌లకు చెందిన మీర్కుత్బుద్దీన్ అలీఖాన్ వారసులమంటూ, సంబంధిత భూమిపై తమకు హక్కులు ఉన్నాయంటూ గత కొద్ది రోజులుగా స్థానిక తహసీల్దార్ కార్యాలయంతోపాటు కలెక్టరేట్లో వినతిపత్రాలు అందజేస్తూ వస్తున్నారు. అయితే దేశ్‌ముఖ్ వారసులమంటూ చెప్పుకొస్తున్న వారితో స్థానిక రెవెన్యూ అధికారులు కుమ్మక్కై నెల్లి అంజమ్మ పేరిట చేసుకున్న దరఖాస్తును రద్దు చేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా టీఎం-33 అప్లికేషన్ రద్దు కావడంతో వెంటనే సక్సెషన్‌కు దరఖాస్తు చేసుకోవడంతో ఈ భూ వ్యవహారంలో రెవెన్యూ అధికారుల హస్తముందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దేశ్‌ముఖ్ వారసులమంటూ చెప్పుకొంటున్న వారి తరఫున స్థానిక తహసీల్దార్‌కు పలుమార్లు అధికార పార్టీ నేత ఒకరు ఒత్తిడి కూడా తెచ్చినట్లు తెలిసింది. ఇంత ప్రక్రియ జరిగినా ధరణిలో మాత్రం ఇంకా దేశముఖ్‌లకు చెందిన మీర్కుత్బుద్దీన్ అలీఖాన్ పేరిటనే ఉండడంతో ఇదే అదనుగా 10 ఎకరాల భూమిని కాజేసేందుకు అక్రమార్కులు పక్కా వ్యూహం చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ భూ వ్యవహారం వెనుక ఎవరున్నారనే దానిపై పూర్తి విచారణ జరపాలని బాధితులు జిల్లా కలెక్టర్‌ను కోరుతున్నారు.
మా అమ్మ పేరిట ఓఆర్సీ జారీ అయిన తర్వాత పట్టదారు పాసుపుస్తకం కోసం ఏడాది క్రితం దరఖాస్తు చేసుకున్నాం. రెవెన్యూ ఇన్స్పెక్టర్ వచ్చి విచారణ చేసి వెళ్లారు. తర్వాత చాలా సార్లు దరఖాస్తును పరిష్కరించాలని కలిశాం. ధరణి మాడ్యుల్ మార్పులు, చేర్పులు అవుతున్నదని, మీకు ఆబ్జెక్షన్స్ వస్తున్నాయని, మేం చేయబోమని తహసీల్దార్ చెబుతూ వచ్చారు. మూడు రోజుల క్రితం మేం పెట్టుకున్న దరఖాస్తు రద్దు అయినట్లు మా తమ్ముడు ధరణిలో చూస్తే తెలిసింది. ఆ తర్వాత తహసీల్దార్‌ను కలిసి విషయం చెప్పాం. మా ముత్తాతల నుంచి కబ్జాలో ఉన్నాం. మా అమ్మ పేరిట ఓఆర్సీ కూడా జారీ అయినా కావాలని పెండింగ్‌లో పెట్టారు. మాకు న్యాయం చేయాలని కోరుతున్నా.
– నెల్లి ప్రభాకర్, నెల్లి అంజమ్మ కుమారుడు