ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 21 : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు బేషుగ్గా ఉన్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి అనిల్ కితాబిచ్చారు. శనివారం ఆయన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితారామచంద్రన్తో కలిసి మండలంలోని రాయపోలు గ్రామంలో పర్యటించి.. జరిగిన పనులను పరిశీలించారు.
గ్రామంలో పనులు చేస్తున్న కూలీలతో మాట్లాడుతూ.. సక్రమంగా పని కల్పిస్తున్నారా..? సరిగ్గా డబ్బులు చెల్లిస్తున్నారా..? తాగు నీరు, నీడ, మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచుతున్నారా.. అని అడుగగా.. అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని వారు చెప్పడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కూలీల హాజరును రోజువారీగా నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం ద్వారా ఏ విధంగా తీసుకుంటున్నారో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆయన స్వచ్ఛ త హీ సేవా కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మొక్కను నాటి నీరు పోశారు.
పచ్చదనం, పరిశుభ్రతను పెంపొందించాలని, గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, స్పెషల్ కమిషనర్ శఫీఉల్లా, జాయింట్ కమిషనర్ నర్సింహులు, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారిణి శ్రీలత, ఏపీడీలు సక్రియానాయక్, చరణ్గౌతమ్, సీఆర్డీ ప్రోగ్రాం ఆఫీసర్లు మురళి, కృష్ణమూర్తి, అంబేద్ఖాన్, ఎంపీడీవో వెంకటమ్మ, ఏపీవో తిరుపతిచారి, ఈసీ రవికుమార్, టీఏ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి అలివేలు, ఫీల్డ్ అసిస్టెంట్ యాదగిరి, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.