యాచారం, మార్చి26 : ఫార్మాసిటీ బాధిత రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించే పాదయాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ పిలుపునిచ్చారు. మండలంలోని కుర్మిద్ద, తాటిపర్తి, నానక్‌నగర్, మేడిపల్లి గ్రామాలలో బుధవారం జీపుజీతాను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఫార్మా బాధిత రైతుల సమస్యల పరిష్కారం కోసం నేటి నుంచి రెండు రోజుల పాటు పాదయాత్రను నిర్వహింనున్నట్లు తెలిపారు. పాదయాత్రను మండలంలోని మేడిపల్లి గ్రామంలో గురువారం ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ముఖ్య అతిథిగా హాజరై పాదయాత్రను ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. మేడిపల్లి నుంచి మల్కీజ్‌గూడ, గాండ్లగూడ, యాచారం, గున్గల్, ఆగపల్లి, ఇబ్రహీంపట్నం, శేరిగూడ, పటేల్‌గూడ, కొంగరకలాన్ మీదుగా కలెక్టర్ కార్యాలయానికి పాదయాత్ర చేరుకుంటుందని వివరించారు. శుక్రవారం రైతులతో కలిసి కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేసి, రైతుల సమస్యలను కలెక్టర్‌కు విన్నవించనున్నట్లు చెప్పారు. యాచారం, కందుకూరు మండలలాలకు చెందిన ఫార్మా బాధిత రైతులు, సీపీఎం నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సీపీఎం పాదయాత్రను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఫార్మాసిటి బాధిత రైతుల సమస్యలను పరిష్కరించే వరకు సీపీఎం ఆధ్వర్యంలో ప్రభుత్వంపై నిరంతర పోరాటాలు కొనసాగిస్తామన్నారు.