సిటీబ్యూరో/బండ్లగూడ, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): మూసీ పరీవాహక ప్రజల భూములను లాక్కొనేందుకు కాం గ్రెస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నది. భూసేకరణ నియమ నిబంధనలను తుంగలో తొక్కి నియంతృత్వం గా భూములు, ఇండ్లను లాక్కొంటున్నది. అధికారులను అడ్డుపెట్టుకుని మూసీ పరీవాహక ప్రజల నివాస హక్కులను హరిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నది. భూసేకరణకు గ్రామసభలు పెట్టి బాధితుల వినతులు పట్టించుకోకుండా నామమాత్రంగా సమావేశం నిర్వహించి తదుపరి నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నది.
గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరిట బాపుఘాట్ సమీపంలోని మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌ను స్వాధీనం చేసుకుంటామని గతంలో ప్రకటించారు. తాజాగా సోమవారం అభ్యంతరాలు తెలిపేందుకు రావాలని మున్సిపల్ ఆఫీసులో గ్రామసభ నిర్వహించింది. గ్రామసభలో బాధితుల వినతులు, అభ్యర్థనలు వినకుండా అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాధితుల అభ్యర్థనను పట్టించుకోకుండా భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేసి రెండు నెలలు పూర్తయినందున మరోసారి సమావేశం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సర్వే నంబర్ 89, 90లోని 10.34 ఎకరాలను స్వాధీనం చేసుకుంటామని వెల్లడించారు. తదుపరి నోటీసులు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికీ జారీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో బాధితులు, అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. తమ ఇండ్లను తీసుకునేందుకు అంగీకరించమని ఒక డ్రాఫ్ట్‌ను తయారుచేసి తమ అంగీకారం లేకుండా ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేశారు.
గ్రామసభలో తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని మధు పార్క్ రిడ్జ్ నివాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కి కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నదని, తమ ఇండ్లను ఖాళీ చేసే సమస్యే లేదని బాధితులు తేల్చి చెప్పారు. గ్రామసభలో బాధితుల అభ్యర్థనను పట్టించుకోకుండా అధికారులకు నచ్చినట్లు ప్రకటనలు చేస్తే ఎలా అని నిలదీశారు.
ప్రభుత్వం పరిహారం విషయంలో రోజుకో మాట మాట్లాడుతూ భయాందోళనలకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. ఒకసారి ఫ్లాట్‌కు ఫ్లాట్ ఇస్తామని, మరోసారి భూమికి భూమికి ఇస్తామని చెప్తూ.. ఇప్పుడు అవేమీ లేకుండా నోటిఫికేషన్ ప్రకారమే ముందుకెళ్తామని చెప్తుండటం ఏంటని నిలదీశారు. అసలు ప్రాజెక్టుపై కనీస అవగాహన లేకుండా బాధితులను మానసికంగా వేధిపులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని విధాల ఇబ్బందులు పెట్టినా తమ ఇండ్లను ఖాళీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. భూసేకరణ నిబంధనలను పాటించకుండా తదుపరి నోటీసులు జారీ చేస్తామని ఎలా ప్రకటిస్తారని అధికారులను నిలదీశారు. ప్రాణాలు పోయినా కష్టపడి కట్టుకున్న ఇండ్లను వదులుకోబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏకపక్ష ధోరణికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.