వికారాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను బకాయిల వసూళ్లలో మున్సిపాలిటీలు వెనుకబడ్డాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే జిల్లాలోని మున్సిపాలిటీల్లో చాలా తక్కువ మొత్తంలో ఆస్తి పన్ను వసూలైంది. ముఖ్యంగా తాండూరు మున్సిపాలిటీలో నిర్దేశించిన లక్ష్యంలో కేవలం 44 శాతం పన్ను బకాయిలు వసూలైంది. సంబంధిత మున్సిపాలిటీ అధికారులు పన్ను బకాయిలు రాబట్టడంపై తగిన దృష్టి పెట్టకపోవడంతోనే ఇంత తక్కువలో వసూలైనట్లు తెలుస్తున్నది.
ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ తదితర కార్యక్రమాలతో మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లలో వెనుకబడినట్లు అధికారులు చెబుతున్నారు. తాండూరు మున్సిపాలిటీలో రూ.9.72 కోట్ల ఆస్తి పన్ను రావాల్సి ఉండగా.. కేవలం రూ.4.30 కోట్లు రాబట్టారు. అదేవిధంగా వికారాబాద్ మున్సిపాలిటీలో రూ.3.67 కోట్లకు.. రూ.3.34 కోట్లు (91 శాతం), పరిగిలో రూ.2.17 కోట్లకుగాను రూ.1.71 కోట్లు(79.02 శాతం), కొడంగల్ మున్సిపాలిటీలో 1.49 కోట్లకు.. రూ.1.11 కోట్లు వసూలు చేశారు.
జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో భారీగా ఆస్తి పన్ను వసూలైంది. గ్రామ పంచాయతీలన్నీ కలిపి రూ.9.57 కోట్ల పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా.. రూ.9.02 కోట్ల(94.22 శాతం) పన్నును రాబట్టారు. గత ఐదారేండ్లుగా జీపీల్లో ఆస్తి పన్ను లక్ష్యానికి అనుగుణంగా వసూలవుతున్నది. ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించడం కూడా ఆస్తి పన్ను వసూళ్లు పెరగడానికి కారణంగా చెప్పవచ్చు. జీపీల్లో వచ్చిన రూ.9.02 కోట్లలో పన్నుల రూపంలో రూ.8.43 కోట్లురాగా, నాన్ ట్యాక్స్ రూపంలో రూ.59.11 లక్షలు వచ్చింది. వికారాబాద్ మండలంలో వందశాతం పన్ను వసూలు కాగా, మిగతా మండలాల్లో 90 శాతానికిపైగా పన్ను వసూలైంది.