ఆదిబట్ల, జనవరి 6 : మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేసి, కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి డీ కిషన్, జిల్లా కార్యదర్శి ఎం చంద్రమోహన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటి వారంలోనే జీతాలు చెల్లించాలని, డబుల్ బెడ్రూంలు, ఇండ్ల స్థలాలు, కేటాయించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు 8 గంటల పని దినాన్ని అమలు చేయాలన్నారు.
ఆదివారం, పండుగలకు సెలవులు ఇవ్వాలని కోరారు. కార్మికులకు రెయిన్ కోట్లు, స్వెట్టర్లు, సబ్బులు, బట్టలు, కొబ్బరి నూనె, ఇతర రక్షణ సామగ్రి అందజేయాలన్నారు. మృతి చెందినవారి స్థానంలో వారి కుటుంబ సభ్యులనే నియమించాలన్నారు. డ్రైవర్లకు రూ.19,500 వేతనం చెల్లించాలన్నారు.ఈ ధర్నాకు సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు జి యాదగిరి, సీఐటీయూ ఉపాధ్యక్షుడు రుద్రకుమార్, జిల్లా కమిటీ సభ్యులు ఏర్పుల నర్సింహ, తులసీగారి నర్సింహ, మండల సత్యనారాయణ, జే పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, తుర్కయాంజాల్, పెద్ద అంబర్పేట, ఆమనగల్లు, షాద్నగర్, శంషాబాద్, నార్సింగి, మణికొండ మున్సిపాలిటీల నుంచి కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.