కొడంగల్ మండలం ధర్మాపూర్ గ్రామ పాఠశాల ఉపాధ్యాయుడు డిప్యూటేషన్‌పై ఇతర ప్రాంతంలో విధులు నిర్వహించారు. ఇటీవల ట్రాన్స్ఫర్ కావడంతో ఖాళీ కాగా ఇక్కడ చదివే12 మంది విద్యార్థులు ప్రస్తుతం అంగడిరాయచూరు పాఠశాలలో చేరారు. అదేవిధంగా దౌల్తాబాద్ మండలంలోని బిచ్చాల్ తండాలోనూ టీచర్ పోస్ట్ ఖాళీగా ఉన్నది. ఇక్కడ 15 మంది విద్యార్థులు ఉండగా.. ప్రత్యేక ఉపాధ్యాయుడితో కొనసాగిస్తున్నారు. ఇలా జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
వికారాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్నది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. కొన్ని చోట్ల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలను ఒకరిద్దరు ఉపాధ్యాయులతోనే కొనసాగిస్తున్నారు. యూపీఎస్‌లో ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లు, ఇద్దరు భాషా పండితులు ఉండాల్సి ఉండగా..చాలా స్కూళ్లలో ఒక్కరిద్దరితోనే నడిపిస్తున్నారు. మరికొన్ని స్కూళ్లలో సింగిల్ టీచర్‌తోనే కాలం వెళ్లదీస్తున్నారు.
ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల పదోన్నతులతో జిల్లాలో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. గతంలో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలతో పోలిస్తే ప్రస్తుతం మరిన్ని పెరిగాయి. భాషాపండితులు, ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు రావడంతో చాలా స్కూళ్లలో ఖాళీలు ఏర్పడ్డాయి. అయితే ఉపాధ్యాయుల కొరతతో పదోన్నతులు వచ్చిన సింగిల్ టీచర్ స్కూళ్ల నుంచి ఇప్పటికీ ఉపాధ్యాయులను రిలీవ్ చేయలేదు. మరోవైపు జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లు ఇప్పటికే మూతబడ్డాయి. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనకు రూ.కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో వెయ్యికిపైగా ఖాళీలు…
జిల్లాలో 649 ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందారు. వీరిలో లోకల్ బాడీ కింద పనిచేసే ఉపాధ్యాయులు 624 మంది ఉండగా, 25 మంది ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఎస్జీటీలు ఉన్నారు. స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు రావడంతో సంబంధిత పోస్టులు ఖాళీగా మారాయి. 338 మంది భాషా పండితులు ఉండగా.. ఇందులో అప్‌గ్రేడైన 301 మంది భాషా పండితుల పోస్టులూ ఖాళీ అయ్యాయి.
అదేవిధంగా మల్టిపుల్ ప్రమోషన్లతో 20-30 స్కూల్ అసిస్టెంట్లు ఖాళీలున్నాయి. ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు.. ఫిజికల్ సైన్స్, గణితం సబ్జెక్టులను ఎంపిక చేసుకునే వీలుండడంతో రెండు సబ్జెక్టులకు రెండు చోట్ల ఆప్షన్లు పెట్టుకొని ఒకేచోట విధుల్లో చేరడంతో మిగతా చోట ఖాళీలు ఏర్పడ్డాయి. మరోవైపు జిల్లావ్యాప్తంగా సింగిల్ టీచర్ ఉన్న స్కూళ్లు 35 ఉండగా, పదోన్నతులు పొంది బదిలీ అయినప్పటికీ టీచర్ల కొరతతో తప్పనిసరిగా మూతబడాల్సిన పరిస్థితి ఉండడంతో సింగిల్ టీచర్ స్కూళ్లలో పదోన్నతులు వచ్చిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయకపోవడం గమనార్హం.
ఇక డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 367 పోస్టుల ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయడంతోపాటు పరీక్షను కూడా నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పటికే జారీ చేసిన నియామకాల్లోనూ వర్తింపజేస్తామని ప్రభుత్వం ప్రకటించిన దృష్ట్యా డీఎస్సీ ఫలితాలు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
సీఎం నియోజకవర్గంలోనే ..
సీఎం రేవంత్‌రెడ్డి కేవలం తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ, వికారాబాద్ జిల్లాలోని పరిగి, వికారాబాద్, తాండూరు నియోజకవర్గాలకు అన్యాయం చేస్తున్నారు. ఇప్పటికే అభివృద్ధి విషయంలో తారతమ్యం చూపిస్తూ కేవలం కొడంగల్‌కే రూ.వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను మంజూరు చేస్తున్న సీఎం.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల విషయంలోనూ ఇదే విధంగా వ్యవహరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఉపాధ్యాయుల కొరతతో జిల్లావ్యాప్తంగా చాలా ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత వేధిస్తుండడంతో ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి విద్యావలంటీర్లను నియమించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే ప్రభుత్వం కేవలం కొడంగల్ నియోజకవర్గం వరకు మాత్రమే అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కొడంగల్, బొంరాసుపేట, దుద్యాల, దౌల్తాబాద్ మండలాల్లోని 52 ప్రభుత్వ స్కూళ్లలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించుకునేందుకు వెసులుబాటు కల్పించింది.
అయితే ఎక్కువగా ఖాళీలున్న ప్రాథమిక పాఠశాలల్లో కాకుండా కేవలం ప్రాథమికోన్నత, జడ్పీహెచ్ఎస్ పాఠశాలల్లోనే అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించేందుకు ఉత్తర్వులిచ్చింది. అదేవిధంగా అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికిగాను ఎంపీడీవో, ఎంఈవో, ఏఏఎంసీ, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం, సంబంధిత స్కూల్ హెచ్ఎంలతో ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 15లోగా అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మిగతా వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లోనూ ఉపాధ్యాయ కొరత వేధిస్తున్నప్పటికీ సంబంధిత నియోజకవర్గాలను విస్మరించడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.