జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, 493 రెవెన్యూ గ్రామాలను కలుపుతూ ప్ర భుత్వం వికారాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(వుడా)ని ఏర్పాటు చేసింది. వుడా ఏర్పాటుతో గ్రామ పంచాయతీలు నిర్వీర్యం అవుతాయని, వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారనున్నదని, ప్రజలకు మరిన్ని కష్టాలు పెరుగుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. పంచాయతీలకు ప్రజల నుంచి పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలో సగానికిపైగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకే వెళ్లనున్నదని.. భవిష్యత్తులో భవన నిర్మాణ, ఇతర అనుమతులను అర్బన్ అథారిటీ నుంచి పొందాల్సి వస్తుందని, అంతేకాకుండా కేంద్రం నుంచి గ్రామాలకు వచ్చే నిధులూ ఆగిపోనున్నాయని పలువురు పేర్కొంటున్నారు.
– వికారాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ)
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గ్రామ పంచాయతీల మనుగడ ప్రశ్నార్థకం కానున్నది. జిల్లాను యూనిట్‌గా తీసుకొని ఏర్పాటు చేసిన వికారాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (వుడా)తో జిల్లావాసులకు మరిన్ని కష్టాలు రానున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. జిల్లా సమగ్రాభివృద్ధికే వుడాను ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెబుతున్నా.. అర్బన్ అథారిటీ ద్వారా ప్రజల నుంచి పన్నుల రూపంలో మరింత ఆదాయాన్ని రాబట్టేలా ప్రణాళిక ఉన్నదనే చర్చ జరుగుతున్నది. అంతేకాదు అర్బన్ అథారిటీ అందుబాటులోకొస్తే గ్రామ పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యం కానున్నాయి. ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు నేరుగా వచ్చే ఆదాయంలో సగానికిపైగా అర్బన్ అథారిటీ డెవలప్మెంట్కు వెళ్లనున్నది. ప్రస్తుతం కొన్ని గ్రామ పంచాయతీల్లో లే-అవుట్లు తదితరాలతో గ్రామాల అభివృద్ధికి సరిపడా రెవెన్యూ సమకూరుతున్నది. అంతేకాకుండా అర్బన్ అథారిటీ పరిధిలోని పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పన్నులు కూడా భారీగా పెరిగి ప్రజలకు మరింత భారం కానున్నది. దీంతో పంచాయతీలకు ఇకపై పన్ను వసూలు విషయంలోనే అజమాయిషీ ఉంటుందని, వసూలైన పన్ను ల్లో మెజార్టీ శాతం ఆదాయం అథారిటీకే వెళ్లనుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. చిన్న గ్రామ పంచాయతీలతోనే సుపరిపాలన, సమగ్రాభివృద్ధి సాధ్యమని భావించిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి అభివృద్ధితోపాటు స్వచ్ఛత తదితరాలకు భారీగా నిధులు వెచ్చించి దేశంలోనే ఆదర్శ గ్రామ పంచాయతీలుగా అవార్డులు సాధిస్తే… కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసి ఆర్థికంగా చితికిపోయేలా వ్యవహరిస్తున్నదని పలువురు మండిపడుతున్నారు.
ఇక.. అథారిటీదే పెత్తనం
అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుతో గ్రామ పంచాయతీలు నిర్వీర్యం కానున్నాయి. పంచాయతీల అభివృద్ధే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలో ఉన్న 365 గ్రామ పంచాయతీలను 560కి పెంచింది. వాటిలో దాదాపు 100 తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనులకు స్వపరిపాలనతోపాటు అధికారా న్ని కల్పించింది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో గిరిజనులకు స్వపరిపాలన దూరమై సర్వాధికారాలు అర్బన్ అథారిటీ పరం కానున్నాయి. అంతేకాకుండా భవన నిర్మాణ అనుమతులు మొదలుకొని వాణిజ్య తదితర అనుమతులన్నీ అర్బన్ అథారిటీ నుంచి పొందాల్సిందే. ఇప్పటివరకు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఉన్న ఫీజులకు మించి అర్బన్ అథారిటీలో ఉండనున్నాయి. పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా ఆగిపోనున్నాయి. అధికారంలోకి వచ్చి 11 నెలలు దాటినా గ్రామ పంచాయతీలకు రూపాయీ విదల్చని కాంగ్రెస్ ప్రభుత్వం .. అర్బన్ అథారిటీతో ఏమి ఒరగబెడుతుందని పలువురు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
వుడా ఏర్పాటు..
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, 493 రెవెన్యూ గ్రామాలను కలుపుతూ ప్ర భుత్వం వికారాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(వుడా) ఏర్పాటు చేసింది. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీలతోపాటు కొడంగల్ మండలంలోని 17 రెవెన్యూ గ్రామాలు, వికారాబాద్ మండలంలోని 24 రెవెన్యూ గ్రామాలు, తాండూరు మండలంలోని 39 రెవెన్యూ గ్రామాలు, పరిగి మండలంలోని 35, బొంరాస్‌పేట మండలంలోని 16, దుద్యాల మండలంలోని 12, కులకచర్ల మండలంలోని 15, బషీరాబాద్ మండలంలోని 30, మోమిన్‌పేట మండలంలోని 22, నవాబుపేట మండలంలోని 21, ధారూరు మండలంలోని 32, దౌల్తాబాద్ మండలంలోని 24, యాలాల మండలంలోని 32, బంట్వారం మండలంలోని 13, కోట్‌పల్లి మండలంలోని 17, పూడూరు మండలంలోని 33 , మర్పల్లి మండలంలోని 27, దోమ మండలంలోని 27, పెద్దేముల్ మండలంలో ని 28, చౌడాపూర్ మండలంలోని 13 రెవెన్యూ గ్రామాలను వుడా పరిధిలోకి తీసుకుని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వుడా చైర్మన్‌గా కలెక్టర్, వైస్ చైర్మన్‌గా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, సభ్యులుగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి లేదా కార్యదర్శి లేదా వారు నామినేట్ చేసిన వారితోపాటు సీడీఎంఏ, డీటీసీపీ సభ్యులుగా నియమించారు.