కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎలాంటి షరతుల్లేకుండా రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని అన్నదాతలను మాయ చేసి అధికారంలోకి రాగానే మొండి చెయ్యి చూపుతున్నది. నిబంధనల పేరుతో ఎన్నో కొర్రీలు పెట్టి వేలాది మంది అర్హులను మాఫీకి దూరం చేసింది. అయితే రైతుల నుంచి వ్యతిరేకత రాగానే.. అర్హులందరి రుణాలను మాఫీ చేస్తామని చెప్పి..రుణమాఫీ గ్రీవెన్స్ ప్రక్రియను చేపట్టింది. ఈ విధానంలో వ్యవసాయాధికారులు ఇంటింటికీ తిరుగుతూ మాఫీ వర్తించని అన్నదాతల నుంచి వివరాలను సేకరించి ప్రత్యేక యాప్‌లో ఎంట్రీ చేస్తున్నారు. గత నెల రోజులకు పైగా ఈ ప్రక్రియ సాగుతున్నా ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఒక్క దరఖాస్తును కూడా పరిష్కరించకపోవడంతో అన్నదాతలు మండిపడుతున్నారు. కాలయాపన కోసం రుణమాఫీ గ్రీవెన్స్‌ను తీసుకొచ్చారని పేర్కొంటున్నారు. కాగా వికారాబాద్ జిల్లాలో రుణమాఫీ గ్రీవెన్స్‌కు ఇప్పటివరకు 25,000 పైగా దరఖాస్తులొచ్చాయి.
వికారాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): జిల్లాలో రుణమాఫీ గ్రీవెన్స్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. నెల రోజులకు పైగా రుణమాఫీ కాని రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నా ఇప్పటివరకు ఒక్క దరఖాస్తుకూ మోక్షం లభించలే దు. అర్హులైనప్పటికీ రూ. 2 లక్షల్లోపు రుణాలు మాఫీ కాని అన్నదాతలు కలెక్టరేట్ మొదలుకొని మండల వ్య వసాయ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ఒక్కో రైతు నాలుగైదు సార్లు రుణమాఫీ వర్తించలేదని వ్యవసాయాధికారులకు దరఖాస్తు చేసుకున్నా.. ఇప్పటివరకు ప్రభుత్వం ఒక్క దరఖాస్తు ను కూడా పరిష్కరించి రుణాలను మాఫీ చేయలేదు. కేవలం కాలయాపన కోసమే గ్రీవెన్స్ ప్రక్రియను చేపట్టినట్లు మాఫీ వర్తించని అన్నదాతలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ అంటూ అనేక కొర్రీలు, నిబంధనలు పెట్టి వేలాది మంది రైతులకు మాఫీ వర్తించకుండా చేసింది. రుణాలు మాఫీ కాని అన్నదాతల కో సం ప్రభుత్వం మొదట కలెక్టరేట్లో కాల్ సెం టర్ ఏర్పాటుతోపాటు డీఏవో, మండల వ్యవసాయాధికారి కార్యాలయాల్లో అప్లికేషన్లను స్వీకరించింది. అనంతరం మండల వ్యవసాయాధికారులకు గ్రీవెన్స్ బాధ్యతలు అప్పగించి ప్రత్యేకంగా యాప్‌ను ఏర్పాటు చేసింది. అయి తే గత నెల రోజులకుపైగా మండల వ్యవసాయాధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తూ రుణమాఫీ కాని రైతుల వివరాలను యాప్‌లో పొందుపరుస్తున్నారు. అయితే రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకోవడం, ఒకరి ఆధార్ నంబర్‌కు బదులు మరొకరి ఆధార్ నంబర్ ఎంట్రీ చేయడం, వడ్డీని కలపకుండా కేవలం రైతులు తీసుకున్న రుణాలను మాత్రమే ఎం ట్రీ చేయడం తదితర కారణాలతో జిల్లాలోని దాదా పు 80 వేల మంది రైతులు నష్టపోయారు.
రుణమాఫీ గ్రీవెన్స్‌కు 25 వేలకుపైగా దరఖాస్తులు
జిల్లాలోని గ్రీవెన్స్‌కు ఇప్పటివరకు 25,011 మంది రైతులు రుణమాఫీ కాలేదని ఫిర్యాదు చేశారు. అందులో అత్యధికంగా రేషన్ కార్డు లేకపోవడంతోనే 18,431 మందికి కాలేదని వ్యవసాయాధికారుల సర్వేలో తేలింది. కాగా నవాబుపేట మండలంలో రెండు వేల మందికిపైగా రైతులు గ్రీవెన్స్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లాలో సుమారు 1.70 లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటే ..రూ.2 లక్షల్లోపు రుణమాఫీతో కేవలం 91,956 మందికే లబ్ధి చేకూరింది. అయితే మొదటి విడతలో 46,633 మందికి రూ.256.26 కోట్లు, రెండో విడతలో 26,438 మందికి రూ. 265.04 కోట్లు, మూడో విడతలో 18,885 మందికి రూ.247.71 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. మరోవైపు రూ.2 లక్షలకు పైగా రుణాలు ఉన్న రైతుల పరిస్థితి గందరగోళంగా తయారైంది. కటాఫ్ రుణానికి మించి ఉన్న రైతుల్లో చాలామంది ఇప్పటికే పైన ఉన్న మొత్తాన్ని చెల్లించి సంబంధిత రసీదులను వ్యవసాయాధికారులకు అందజేసినప్పటికీ ఎలాంటి స్పష్టత లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.2 లక్షలకు పైగా ఉన్న రుణాలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి విధివిధానాలు రూపొందించలేదు. దీంతో అన్నదాతలు రుణాలు మాఫీ అవుతాయా..? లేదా అని మథనపడుతున్నారు.
కొనసాగుతున్న సర్వే..
రుణమాఫీ కాని రైతుల వివరాల సేకరణకు వ్యవసాయాధికారులు ఇం టింటి సర్వే చేస్తున్నారు. అయితే ఇప్పటికే అన్ని అర్హతలున్నా మాఫీ వర్తించని రైతులు మండల వ్యవసాయాధికారి, ఏడీ, డీఏవో కార్యాలయాల్లో.. ఒక్కో రైతు ఇప్పటికే నాలుగైదు సార్లు ఫిర్యాదు చేశారు. అయినా సమస్యను పరిష్కరించకుండానే మళ్లీ ఇంటింటి సర్వే చేయడంపై వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎంత రుణం తీసుకున్నారు..? రెన్యువల్ చేశా రా..? లేదా..? రేషన్ కార్డు వివరాలు, పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు ఖాతాల్లోని పేర్లను పరిశీలించి వ్యవసాయాధికారులు ప్రత్యేక యాప్‌లో ఎంట్రీ చేస్తున్నారు.
వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న అన్నదాతలకు త్వరలోనే మీ రుణాలు మాఫీ అవుతాయంటూ సమాధానం చెప్తూ వారిని అక్కడి నుంచి పంపిస్తున్నారు. పట్టాదారు పాసు పుస్తకం, బ్యాంకు ఖాతా పుస్తకంలో వేర్వేరుగా ఎంట్రీ అయిన పేర్లను సవరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో రైతులు పదిహేను రోజులుగా బ్యాంకులకెళ్లి పేర్లను సరి చేయించుకుంటున్నారు.