ఇబ్రహీంపట్నం, మార్చి 18 : తాతలు, తండ్రుల కాలం నుంచి భూమిని నమ్ముకుని భూమి తల్లిని సాగుచేసుకుని జీవిస్తున్న మా పచ్చని పంటపొలాలను ఫ్యూచర్సిటి పేరుతో లాక్కోవాలని చూస్తే సహించేది లేదని యాచారం మండలం మొండిగౌరెల్లి గ్రామ రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండిగౌరెల్లి గ్రామంలో భూసేకరణ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రైతులు ఇబ్రహీంపట్నంలోని ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా నిర్వహించారు. అనంతరం ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బండిమీది కృష్ణతో పాటు పలువురు రైతులు మాట్లాడుతూ.. ప్రాణాలు అయినా ఇస్తాం.. కాని, మా తాతలు, తండ్రుల కాలం నుంచి సాగుచేసుకుంటూ… మా కుటుంబాలు జీవిస్తున్న మా భూములను మాత్రం ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. పేదరైతుల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం కంపెనీల పేరుతో తీసుకోవటం తీవ్ర అన్యాయమని మండిపడ్డారు. ముఖ్యంగా గ్రామంలో భూముల కోసం ఎవరు వచ్చినా తరిమికొడతామని హెచ్చరించారు. రాజకీయాలకతీతంగా గ్రామస్తులమంతా ఉధ్యమాన్ని ఉదృతం చేస్తామని కలెక్టర్ కార్యాలయం, సెక్రెటరియేట్లను కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్సిటి కోసం గ్రామంలో 821 ఎకరాల భూములను సేకరిస్తున్నట్లు నోటిఫికేషన్ జారీచేసిందని, వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పచ్చని పంటలు సాగుచేసుకునే మా పొలాలను పరిశ్రమల పేరుతో లాక్కోవటం సరైన పద్దతి కాదన్నారు. మా గ్రామాన్ని భవిష్యత్తు ఫ్యూచర్సిటిలో కలపాలని వినతిపత్రాలు ఇస్తే… గ్రామంలో ఉన్న రైతుల భూములను లాక్కునేందుకు రేవంత్ సర్కారు ప్రయత్నాలు చేస్తుందని వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు.
పారిశ్రామిక వాడల పేరుతో భూములు తీసుకుంటామంటూ ఊరుకునేది లేదు : బొరిగ యాదయ్య
మొండిగౌఐరెల్లి గ్రామంలోని పచ్చని పంటపొలాలను పారిశ్రామిక పార్కుల పేరుతో లాక్కుంటామని చూస్తే ఊరుకునేది లేదు. మా గ్రామంలో 100 మందికి పైగా రైతులందరం సమావేశం ఏర్పాటు చేసుకుని తహసీల్దార్, ఆర్డీఓలకు వినతిపత్రాలు సమర్పించాం. మా భూముల కోసం అవసరమైతే మా ప్రాణాలైనా తీసుకుంటాం. కన్నతల్లిలాంటి మా భూములను మాత్రం ఇచ్చేదిలేదు. ఎవరైనా ఇష్టానుసారంగా భూములు లాక్కుంటామని చూస్తే ఊరుకునేదిలేదు.
పచ్చని పంటపొలాల్లో పరిశ్రమల పేరుతో చిచ్చుపెడితే సహించేది లేదు : మండల బాలకృష్ణ
మా తాతల కాలం నుంచి భూమిని నమ్ముకుని జీవిస్తున్నాం. వ్యవసాయం చేసుకుని జీవిస్తున్న మాలాంటి వారికి ఉన్న భూముల్లో అనవసరమైన కంపెనీలు ఏర్పాటు చేసి జీవితాలు చిన్నాభిన్నం చేస్తామంటూ సహించేదిలేదు. మా భూములు మా సొత్తు..ఎవడు వచ్చినా ఉరికించి కొడతాం మా భూములు కాపాడుకుంటాం.