మోమిన్‌పేట, జనవరి 30 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు మన బడి’ పనులను మంగళవారం వరకు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అన్నారు. సోమవారం మండలపరిధిలోని చంద్రయాన్‌పల్లి, ఆమ్రాదికుర్దు గ్రామాల్లో ఎంపికైన మోడల్ పాఠశాల పనుల పురోగతిని అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి పరిశీలించి సంబంధిత సిబ్బందికి పనులపై పలు సూచనలు, సలహాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన ఊరు – మన బడి పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా అన్ని రకాల పనులను, అన్ని హంగులతో సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన గ్రీన్ చాక్ బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో డీఈవో రేణుకాదేవి, ఏఈ ప్రణీత్, ఎంఈవో గోపాల్, సర్పంచులు అంజయ్య, సునీత, మల్లేశం, ఆర్ఐ రాజు, ఎంపీవో యాదగిరి, పాఠశాలల సిబ్బంది పాల్గొన్నారు.