MLC Vani Devi | కందుకూరు : ప్రభుత్వం పురాతన దేవాలయాల అభివృద్ధి కృషి చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణిదేవి కోరారు. మండల పరిధిలోని పులిమామిడి గ్రామంలోని చీకటి వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా బుధవారం కల్యాణోత్సవాన్ని కనుల పండువలా నిర్వహించారు. ఎమ్మెల్సీ కల్యాణ వేడుకలో పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్సీని ఘనంగా సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అందరూ సుఖశాంతులతో ఉండాలని, భగవంతుడి కృప అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. పురాతన ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహించడంపై నిర్వాహకులను అభినందించారు. దేవాలయ అభివృద్ధి కోసం తన పూర్తి సహకారం ఉంటుందన్నారు. ప్రజలు భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని కోరారు. మాజీ సీఎం కేసీఆర్ దేవాలయాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్న ఆలయాలను అభివృద్ధి చేశారన్నారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ మొకరాల రాజశేఖరశర్మ, భాస్కర శర్మ, మాజీ వైస్ ఎంపీపీ ఆనెగౌని సంధ్య , దామోదర్ గౌడ్, బుక్క పాండు రంగారెడ్డి, ఎండీవో సరిత రవీందర్ రెడ్డి, వెంకటేశ్, మహేందర్ రెడ్డి, మహేశ్, యాదయ్య , పంచాయతీ కార్యదర్శి రాజుగౌడ్, మండల పరిషత్ సూపరిండెంట్ సులోచన, రవీందర్ రెడ్డి, రవికుమార్, బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.