చేవెళ్ల రూరల్, జులై 30 : 20 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలకు బుద్ధి చెప్పాలంటే రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించేలా పార్టీ శ్రేణులు సమిష్టిగా, పట్టుదలతో పని చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి దిశానిర్ధేశం చేశారు. బుధవారం చేవెళ్ల మండల పరిధి ముడిమ్యాల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు 50 మందికి పైగా నియోజకవర్గ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు వంగ శ్రీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు గోనె కరుణాకర్ రెడ్డి, శేరి రాజు ఆధ్వర్యంలో సబితారెడ్డి సమక్షంలో నగరంలోని ఆమె నివాసంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
పార్టీలో చేరిన వారికి సబితారెడ్డి బీఆర్ఎస్ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ 20నెలల్లో ప్రజలకు చేసిందేమీ లేదని, ఆరు గ్యారెంటీలతో పాటు 420 హామీలు ఇచ్చి విస్మరించిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు గట్టిగా బుద్ది చెప్పాలంటే స్థానిక సంస్థల ఎన్నికలను బీఆర్ఎస్ చాలెంజ్‌గా తీసుకొని ఘన విజయం సాధించేలా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు.
మౌలిక వసతులు లేక గ్రామాల్లో ప్రజలు నానా అవతస్థలు పడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం దాటవేత దోరణితో.. ఎక్కడా అభివృద్ధి చేయకుండా మాటలతో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని ఎద్దేవా చేశారు. ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా సమిష్టిగా ముందుకు సాగి ప్రజల మన్ననలు పొంది స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేలా శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ పట్లొళ్ల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశిపాల్, బీఆర్ఎస్ నాయకులు షేక్ ఆరిఫ్ మియా, గోనె మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.