చేవెళ్ల రూరల్, ఆగస్టు 1 : గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు తెలియేస్తూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. గులాబీ పటిష్టతకోసం అంకితభావంతో పని చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి దిశానిర్ధేశం చేశారు. చేవెళ్లకు చెందిన ఎస్ఎఫ్ఐ నాయకులు శుక్రవారం సబితారెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి పట్లొళ్ల కార్తీక్ రెడ్డి సమక్షంలో నగరంలోని వారి నివాసంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగాసబితారెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం సూచనల మేరకు కష్టపడిన ప్రతి నాయకుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు.
అనునిత్యం ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారంలో ముందుండాలన్నారు. రేవంత్ సర్కార్ పాలనలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నాడు కేసీఆర్ హయాంలో జరిగిన మంచిని ప్రజలకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో నియోజకవర్గ హరితసేన ఇన్చార్జి, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పూలపల్లి పృథ్వీరాజ్, మండల నాయకులు ఎండీ.ఆసిఫ్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఎండీ. సమీర్, బ్యాగరి తేజ, ఎం.చందు, లడ్డూ, రేవంత్, విజయ్, రాహుల్, అభి, ఎం.విజయ్, శివ, ఊరెళ్ల చరణ్ తదితరులు ఉన్నారు.