షాబాద్, జూలై 16: బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని, ఎల్లప్పుడూ అండగా ఉంటామని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం నగరంలోని ఆమె నివాసంలో షాబాద్ మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వెళ్లి సబితారెడ్డితో పాటు రాష్ట్ర యువనాయకుడు కార్తీక్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజలు, నిరుద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కొంతమంది నాయకులు పార్టీని వీడినంత మాత్రాన నష్టం లేదన్నారు. లక్షల మంది కార్యకర్తలు కేసీఆర్ వెంటే ఉన్నారని గుర్తుచేశారు.
చేవెళ్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసే వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తూతూ మంత్రంగా పథకాలను అమలు చేస్తున్నదని విమర్శించారు. పంట రుణమాఫీ చేస్తామంటున్న కాంగ్రెస్ పార్టీ తిక్కతిక్క నిబంధనలు పెడుతూ రైతులను ఆందోళనకు గురిచేస్తున్నదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి రైతుకూ రుణమాఫీ చేశారన్నారు. గత ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చిందని, సాగునీటికి, పెట్టుబడికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడంతో వ్యవసాయం పండుగలా మారిందన్నారు.
ప్రస్తుతం వర్షాలు సరిగ్గా లేక ఏ చెరువును చూసినా సరిపడా నీళ్లులేవని, భూగర్భజలాలు అడుగంటిపోయాయన్నారు. చేవెళ్ల ప్రాంత ప్రజలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని, ఎవ్వరూ లేరని మీరు ఎప్పుడూ అనుకోవద్దన్నారు. బీఆర్ఎస్ పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్న యువ నాయకుడు అవినాశ్‌రెడ్డికి మీరంతా మద్దతుగా నిలవాలని కోరారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డిని కలిసిన వారిలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గూడూరు నర్సింగ్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నక్క శ్రీనివాస్‌గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు కొలన్ ప్రభాకర్‌రెడ్డి, ఎండీ చాంద్‌పాషా, సూద యాదయ్య, మాజీ సర్పంచ్‌లు పీ దర్శన్, కావలి మల్లేశ్, ర్యాకల శేఖర్, ఈదుల కృష్ణగౌడ్, దేవేందర్‌రెడ్డి, పార్టీ నాయకులు గంగిడి భూపాల్‌రెడ్డి, కొండా రాజుగౌడ్, అవినాశ్‌గౌడ్, గోపాల్, రామస్వామి, ప్రశాంత్‌గౌడ్ తదితరులు ఉన్నారు.
మోకిల్లలో..
చేవెళ్ల రూరల్ : నాయకులు, కార్యకర్తలే పార్టీకి ముఖ్యమని ఎలాంటి పని ఉన్నా.. ఇబ్బందులు ఉన్నా తెలిపితే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం శంకర్పల్లి వ్యవసాయ మారెట్ కమిటీ మాజీ చైర్మన్ సభావత్ రాజూ నాయక్‌ను గ్రామంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి కలిసి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినా నష్టం ఏమీ లేదని, రాబోవు రోజుల్లో వారికి తగిన గుణపాఠం తప్పదన్నారు. తొలి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్కు పూర్వవైభవం తీసుకొచ్చేలా బీఆర్ఎస్ శ్రేణులు సైనికుల్లా పని చేయాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందన్నారు. మాజీ మంత్రి వెంట శంకర్పల్లి మండల మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.