మహేశ్వరం, డిసెంబర్ 7: నియోజకవర్గ ప్రజలకు జవాబుదారిగా పనిచేస్తానని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరంలో నిర్వహించిన కృతజ్ఞతా సభలో ఇన్చార్జి ఎంపీపీ సునీతానాయక్, పార్టీ మండల అధ్యక్షుడు అంగోతు రాజూనాయక్తో కలిసి ఆమె పాల్గొన్నారు. మహేశ్వరంలో ప్రసిద్ధిగాంచిన శివగంగ దేవాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించి మొదటిసారి నియోజకవర్గానికి రావడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సబితాఇంద్రారెడ్డికి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి నియోజకవర్గ ప్రజలు తనకు బ్రహ్మరథం పట్టారని ఆమె తెలిపారు. నియోజకవర్గంలో ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని పని చేస్తానని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగ కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. ఇక ముందు వచ్చేది ఎన్నికల కాలమని, ప్రతి ఒక్కరూ పార్టీ గెలుపునకు కృషి చేయాలని ఆమె సూచించారు. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమంతో ముందుకు సాగుతామని తెలిపారు. అన్ని రంగాల అభివృద్ధికి తనకు సహకరించిన అధికారులు, ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీపీ సునీతా ఆంధ్యానాయక్, సహకార బ్యాంక్ చైర్మన్ మంచె పాండు యాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు చిలకమర్రి నర్సింహ, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంగోతు రాజూనాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కల యాదగిరిగౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆనందం, నాయకులు కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్, కూనయాదయ్య, మునగపాటి నవీన్, కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఆదిల్ అలీ, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్ పాల్గొన్నారు.