పరిగి, ఏప్రిల్ 1 : ఏప్రిల్ 1 నుంచి ప్రతి పేదవాడికి సన్నబియ్యం ఇస్తామంటూ ప్రభుత్వం ఊదరగొట్టగా.. పరిగి నియోజకవర్గంలో సన్నబియ్యం పంపిణీ ఆదిలోనే హంసపాదులా తయారైంది. రాష్ట్రస్థాయిలో ఉగాది పర్వదినం రోజు హుజూర్‌నగర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏప్రిల్ 1న అన్నిచోట్ల ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించాలని సూచించారు. ఈమేరకు అధికారులు సైతం అన్ని ఏర్పాట్లు చేపట్టి వచ్చిన సగం కోటా సన్నబియ్యం సైతం అన్ని రేషన్ దుకాణాలకు చేరవేసి సిద్ధం చేశారు.
కానీ స్థానిక ఎమ్మెల్యే లేకపోవడంతో పరిగి నియోజకవర్గంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం మంగళవారం ప్రారంభం కాలేదు. తెల్ల రేషన్‌కార్డు గలవారికి ఒక్కొక్కరికి నెలకు 6 కిలోలు, అన్నపూర్ణ కార్డు వారికి 10 కిలోలు, అంత్యోదయ కార్డుపై 35 కిలోల బియ్యం అందజేస్తారు. నియోజకవర్గంలోని పరిగి మండలంలో 45, దోమలో 34, కులకచర్లలో 30, పూడూరులో 34 రేషన్ దుకాణాలకు 1086 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయాల్సి ఉండగా స్టాక్ పాయింట్లకు వచ్చిన కోటా మేరకు ప్రతి దుకాణానికి కొంత కోటా సన్నబియ్యాన్ని సోమవారం వరకు పంపిణీ చేసి.. మంగళవారం సన్నబియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేశారు.
మంత్రివర్గంలో చోటు కోసం..
ఈ నెల 3న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే వార్తల నేపథ్యంలో మంత్రివర్గంలో చోటు కోసం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇన్నాళ్లుగా స్వయంగా మంత్రి పదవి కోసం ప్రయత్నించగా.. ఏఐసీసీ నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేల్లో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలంటూ ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి లేఖ రాసిన విషయం విదితమే. మంత్రివర్గ విస్తరణ తేదీ ఒకటి రెండు రోజులే ఉండడంతో.. రంజాన్ సందర్భంగా పరిగి నియోజకవర్గానికి వచ్చిన ఎమ్మెల్యే తిరిగి ఢిల్లీ వెళ్లారు. నేడు సన్నబియ్యం పంపిణీ ప్రారంభించాల్సి ఉండగా.. ఎమ్మెల్యే వచ్చిన తర్వాతే ప్రారంభోత్సవం చేయాలని జిల్లా ఉన్నతాధికారుల నుంచి అన్ని మండలాల రెవెన్యూ అధికారులకు మౌఖికంగా ఆదేశాలు అందాయి. దీంతో మంగళవారం సన్నబియ్యం పంపిణీ ప్రారంభం కాలేదు.
కనీసం బుధవారమైనా ఎమ్మెల్యే ఢిల్లీ నుంచి వస్తారా అంటే సమాచారం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సన్నబియ్యం పంపిణీ ఎప్పుడు జరుగుతుందో అని పేదలు ఆశగా ఎదురుచూడడం తప్ప గత్యంతరం లేని పరిస్థితి నెలకొన్నది. కొన్నిచోట్ల రేషన్‌కార్డుదారులు రేషన్ దుకాణాల దగ్గరకు వెళ్లడం, డీలర్లకు ఫోన్ చేసి సన్నబియ్యం ఎప్పుడు ఇస్తారంటూ ఆరా తీయగా.. ఏమి చెప్పాలో డీలర్లకు పాలుపోని పరిస్థితి. ఎమ్మెల్యే వచ్చాకనే సన్నబియ్యం పంపిణీ చేపట్టనున్నట్లు సమాచారం.