బొంరాస్‌పేట, జూలై 17 : రానున్న ఎన్నికల్లో ప్రజలు, రైతు లు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బతుకులు ఆగమవుతాయని.. అందువల్ల ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని కొడంగ ల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరాపై రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు సోమవా రం మండలంలోని రేగడిమైలారం, దుద్యాల మండలంలోని పోలేపల్లిలోని రైతువేదికల్లో రైతుసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేసి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జరిగిన సభల్లో ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ త్వరలో జరుగనున్న ఎన్నికల్లో ఓట్లకోసం గ్రామాలకొచ్చే కాంగ్రెస్ నాయకులను తరిమికొట్టాలని, ఉచిత విద్యుత్తు అవసరం లేదన్నందుకు వాతలు పెట్టాలని రైతులు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉండి వ్యవసాయం దండగ అన్నారని, ఇప్పుడు రేవంత్‌రెడ్డి ఉచిత విద్యుత్తు అనవసరమని మాట్లాడుతూ రైతులను అవమానిస్తున్నాడని ధ్వజమెత్తారు. రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తూ వ్యవసాయాన్ని పండులా మార్చారని కొనియాడారు. దీంతో అన్నదాతలు ఏడాదిలో మూడు పంటలు పండించి సంతో షంగా జీవిస్తున్నారన్నారు. అంతేకాకుండా అన్నదాతల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదన్నారు. రైతులు బాగుండడం ఓర్వలేకనే కాంగ్రెస్ నాయకులు కల్లబొల్లి మాటలు చెబుతూ వారిని మభ్యపెడుతున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు పూటకోమాట మాట్లాడుతున్న తీరును రైతులు, ప్రజలు జాగ్రత్తగా గమనించి అప్రమత్తంగా ఉండాలన్నారు. మూడు పంటలు పండించే బీఆర్ఎస్ పార్టీ కావాలా..? మూడు గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ శ్రావణ్‌గౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు యాదగిరి, తాలూకా, మండల యూత్ అధ్యక్షు లు నరేశ్‌గౌడ్, మహేందర్, బసిరెడ్డి, ఎంపీటీసీలు జగదీశ్, ఎల్లప్ప, సర్పంచ్‌లు, మధుయాదవ్, దేశ్యానాయక్, టీటీ రామూనాయక్, బాబర్, వెంకట్‌రెడ్డి, బసిరెడ్డి పాల్గొన్నారు.