వికారాబాద్, జూలై 12 : బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ను ఆరు నెలల్లో అమలు చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏమైందని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం వికారాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన బీసీ రిజర్వేషన్‌పై పార్టీ నాయకులతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి ఒక్క సారి కూడా జై తెలంగాణ అన్న పాపాన పోలేదని మండిపడ్డారు.
ఇటీవల బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ఆమోదించినట్లు చెప్పి.. సీఎం రేవంత్‌రెడ్డి బీసీ నాయకుల తో శాలువాలు, పూలమాలలతో సన్మానాలు చేయించుకున్నారని.. పార్లమెంట్లో ఆమో దం పొందితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ వర్తించదని.. ఆ బిల్లును గవర్నర్, రాష్ట్రపతి ఆమోదించి జీవో ఇస్తేనే అమలైనట్లు అని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందునే ముఖ్యమంత్రి హడావుడి చేస్తూ బీసీలకు 42 శాతం ఇస్తామని చెబుతున్నారని.. ఢిల్లీకి ఇప్పటివరకు దాదాపుగా 48 సార్లు వెళ్లినా.. ఏ ఒక్కసారి కూడా బీసీ రిజర్వేషన్‌పై కేంద్రంలోని పెద్దలతో మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలుపుకొని పోయి ఢిల్లీలో ధర్నాలు చేస్తే 42% రిజర్వేషన్ తప్పనిసరిగా వస్తుందని.. బీసీ రిజర్వేషన్ కోసం పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని ఆయన సూచించారు. రిజర్వేషన్ కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
బీసీలపై ప్రేమ లేకపోవడంతోనే ఆరు నెలల్లో ఇస్తామన్న రిజర్వేషన్‌ను 19 నెలలు గడిచినా ఇప్పటికీ స్పష్టత లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేస్తున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారని.. రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం తప్పదని ఆయన జోస్యం చెప్పారు.
అనంతరం రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్ మాట్లాడుతూ..బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించకపోతే రేవంత్‌రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమిళనాడులో ముఖ్యమంత్రి జయలలిత 69 శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలన్నారు. రిజర్వేషన్లను పార్టీ పరంగా ఇస్తామనడం సరికాదని మండిపడ్డారు. సమవేశంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు గోపాల్ముదిరాజ్, మండలాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు గయాజ్, నాయకులు అశోక్, మల్లికార్జున్, రాజేందర్‌గౌడ్, శ్రీనివాస్, మల్లేశం, దత్తు తదితరులు పాల్గొన్నారు.