ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గ్రూపు రాజకీయాలతో సతమతమవుతున్నది. టికెట్ కోసం ఏకంగా ఏడుగురు పోటీపడుతున్నారు. ఒకరు రేవంత్ వర్గీయులైతే.. మరొకరు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇంకొకరు సిట్టింగ్ ఎంపీ కోమటిరెడ్డి వర్గీయులు. పెద్దల ఆశీర్వాదం తనకే ఉందని.. కాంగ్రెస్ అభ్యర్థిగా తానే ఫైనల్ అయినట్లు ఎవరికి వారు చెప్పుకొంటున్నారు. నేతలకు ఒకరంటే ఒకరు పొసగడం లేదు. క్యాడర్ సైతం ఎవరికి వారుగా చీలిపోయింది. వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలను చేపడుతున్నారు. టికెట్ రేసులో ఉన్నవారిలో కొందరు పీసీసీలో కీలక పదవుల్లో ఉన్నప్పటికీ.. ఏనాడు కూడా పార్టీని ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేయలేదు. తీరా.. ఎన్నికల వేళలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుండడంతో క్యాడర్‌ను అయోమయానికి గురి చేస్తున్నది. కాగా.. అధికార బీఆర్ఎస్ పార్టీలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్న ది. పార్టీ నాయకులు, కార్యకర్తలు జోష్‌లో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. గతంలో చేపట్టిన పనులకు ప్రారంభోత్సవాలు చేయడంతోపాటు కొత్త పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు.
రంగారెడ్డి, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): ‘టికెట్ కోసం ఏకంగా ఏడుగురు పోటీపడుతున్నారు. ఒకరు రేవంత్ వర్గీయులైతే.. మరొకరు ఉత్తమ్‌కుమార్ రెడ్డి వర్గీయులు. ఇంకొకరు సిట్టింగ్ ఎంపీ కోమటిరెడ్డి వర్గీయులు. పెద్దల ఆశీర్వాదం తనకే ఉందని.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తానే ఫైనల్ అయినట్లు ఎవరికి వారుగా చెప్పుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తీరు ఎవరికి వారే..యమునా తీరే..అన్నట్లుగా మారింది. టికెట్ రేసులో ఉన్నవారిలో కొందరు పీసీసీలో కీలక పదవుల్లో ఉన్నప్పటికీ.. ఏనాడూ పార్టీని ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేయలేదు. బీఆర్ఎస్ పార్టీలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండి పార్టీ శ్రేణులు దూకుడు మీదుండగా… కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఎన్నికల వేళలోనూ నైరాశ్యం నెలకొంది.’
ఎన్నికల వేళ.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ పార్టీ గ్రూపుల గొడవలతో సతమతమవుతున్నది. మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మర్రి నీరంజన్‌రెడ్డి, దండెం రాంరెడ్డి, పాశం లక్ష్మీపతిగౌడ్, శేఖర్‌గౌడ్, కొత్తకుర్మ మంగమ్మ, ఆమె భర్త శివకుమార్ టికెట్ రేసులో ఉన్నారు. మల్రెడ్డి రంగారెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ వర్గంలో ఉంటే.. దండెం రాంరెడ్డి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో, మర్రి నీరంజన్‌రెడ్డి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో టచ్‌లో ఉన్నారు. ఎవరికి వారుగా టికెట్ కోసం ప్రయత్నం చేసుకుంటున్నారు. పార్టీ క్యాడర్ సైతం చీలిపోయింది. ఈ పరిస్థితుల్లో గతంలో ఉన్న గ్రూపు రాజకీయాలు మరింతగా పెరిగాయి. ఒకరంటే మరొకరికి పొసగక.. ఒకరు హాజరైన కార్యక్రమానికి మరొకరు గైర్హాజరయ్యే పరిస్థితి నెలకొంది. పార్టీ పిలుపునిచ్చిన ఏ ఒక్క కార్యక్రమాన్ని అందరూ కలిసి నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. మల్రెడ్డి రంగారెడ్డి ప్రస్తుతం పీసీసీ వైస్ ప్రెసిడెంట్‌గా, నీరంజన్‌రెడ్డి, రాంరెడ్డిలు పీసీసీ కార్యదర్శులుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్ నేతలు నియోజకవర్గంలో మాత్రం పార్టీ పటిష్టతపై దృష్టి సారించలేకపోవడం పట్ల సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ కోసం ఏడుగురు పోటీ పడుతున్నారు. గతంలో మలక్‌పేట్ ఎమ్మెల్యేగా పనిచేసిన ఈయన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి బీఎస్పీ, కాంగ్రెస్ తరఫున రెండుసార్లు పోటీచేసి ఓడిపోయారు. ఒకసారి మహేశ్వరం నుంచి కూడా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికలప్పుడే నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వస్తారని స్థానికంగా ప్రచారం జరుగుతున్నది. మర్రి నిరంజన్‌రెడ్డి గతంలో ఇబ్రహీంపట్నం ఎంపీపీగా పనిచేయగా.. ప్రస్తుతం ఆదిభట్ల మున్సిపాలిటీ కౌన్సిలర్‌గా కొనసాగుతున్నారు. ఈయన భార్య నిత్య ప్రస్తుతం మంచాల మండలం జడ్పీటీసీగా ఉన్నారు. దండెం రాంరెడ్డి ప్రజాప్రతినిధిగా పనిచేయనప్పటికీ రాజకీయపరమైన పదవుల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం పీసీసీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆశావహుల్లో ఒకరైన పాశం లక్ష్మీపతిగౌడ్ గతంలో ఇబ్రహీంపట్నం ఎంపీపీగా, జడ్పీటీసీగా పనిచేశారు. ఈ నియోజకవర్గంలో బీసీ కార్డు సైతం తెరపైకి వస్తోంది. గతంలో ఆదిభట్ల సర్పంచుగా పనిచేసిన శేఖర్‌గౌడ్ బీసీ కోటాలో టికెట్ కేటాయించాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క బీసీ కోటాలో తుర్కయాంజాల్ కౌన్సిలర్ కొత్తకుర్మ మంగమ్మ కూడా తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. మంగమ్మకు టికెట్ దక్కని పక్షంలో తనకైనా ఇవ్వాలంటూ ఆమె భర్త శివ కుమార్ అధిష్టాన పెద్దలను కోరుతున్నారు. ఈయన గతంలో తుర్కయయాంజాల్ సర్పంచ్‌గా పనిచేశారు. టికెట్ ఎవరికి వచ్చినా కలిసి పనిచేస్తామని నేతలంతా బయటకు చెప్తున్నప్పటికీ తీరా.. అభ్యర్థి ఖరారయ్యాక అందరూ జట్టుగా పనిచేస్తారా? అన్న అనుమానాలను సొంత పార్టీ శ్రేణులే వ్యక్తం చేస్తున్నాయి.
సీఎం కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికే తిరిగి టికెట్ కేటాయించడంతో నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దూకుడును పెంచాయి. టికెట్‌ను ప్రకటించినప్పటి నుంచే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నారు. గతంలో చేపట్టిన పనులకు ప్రారంభోత్సవాలు చేయడంతోపాటు కొత్త పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. మంత్రులు సైతం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి పార్టీ శ్రేణుల్లో జోష్‌ను నింపుతున్నారు. ఈ క్రమంలో వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి నిత్యం పెద్ద సంఖ్యలో చేరికలు ఉంటున్నాయి. ఈసారి ఎన్నికల్లో సైతం నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా రెపరెపలాడడం ఖాయమని పార్టీ శ్రేణులు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి.