రంగారెడ్డి, జూలై 18 (నమస్తే తెలంగాణ) : వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో రంగారెడ్డిజిల్లాలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల పనితీరు రోజురోజుకూ అధ్వానంగా మారుతున్నది. జిల్లావ్యాప్తంగా ఈ సెంటర్లు పేరుకు మాత్రమే పెద్దాస్పత్రులు కాని, డాక్టర్లు అందుబాటులో ఉండటంలేదు. వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో కొనసాగుతున్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌పై సర్వత్రా ఆరోపణలొస్తున్నాయి. ఈ ఆస్పత్రిని 30 పడకల ఆస్పత్రి నుంచి 100 పడకల ఆస్పత్రిగా మారుస్తామని.. అందుకనుగుణంగా డాక్టర్లు, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కాని, వంద పడకల ఆస్పత్రి దిక్కులేకపోగా ఉన్న డాక్టర్లు కూడా అందుబాటులో ఉండటంలేదు. ఆస్పత్రిలో 8 మంది డాక్టర్లు ఉన్నప్పటికీ షిఫ్టు పద్ధతిలో రోజుకు ఇద్దరు డాక్టర్లు మాత్రమే వస్తున్నట్లు రోగులు తెలిపారు. వారూ ఉదయం 10 గంటలు దాటినా రావడంలేదు. డాక్టర్లు వచ్చినా మందులు లేవని సమాధానం చెప్పి పంపిస్తున్నట్లు రోగులు వాపోతున్నారు.
ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, ఆదిబట్ల, మాడ్గుల పోలీస్స్టేషన్ల పరిధిలో జరిగే రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు, అనుమానాస్పద మృతులకు ఇక్కడే పోస్టుమార్టం చేస్తున్నారు. ప్రతిరోజూ ఈ డివిజన్ పరిధిలోని ఔటర్‌రింగ్‌రోడ్డు, హైదరాబాద్-నాగార్జునసాగర్రోడ్డుపై తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగి అనేక మంది మృత్యువాతకు గురవుతున్నారు.
ఆత్మహత్యలు, ఇతరత్రా పోలీసు కేసులకు సంబంధించిన మరణాలకు కూడా ఇక్కడే పోస్టుమార్టం చేస్తున్నారు. కాని, పోస్టుమార్టం చేయాల్సిన డాక్టర్లు మాత్రం అందుబాటులో ఉండటంలేదు. రాత్రి జరిగిన ప్రమాదాలకు సంబంధించిన పోస్టుమార్టాలకు కూడా ఉదయం డాక్టర్లు సకాలంలో రాక మృతుల బంధువులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. డాక్టర్లు 10 గంటలు దాటిన తర్వాత కూడా ఆస్పత్రికి రాకపోవడంతో రోగుల బంధువులు డాక్టర్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు డాక్టర్లు స్థానికంగా ఉండకపోవడం వలన సమస్యలు తలెత్తుతున్నాయని బాధితులు వాపోతున్నారు.
ఆదిబట్ల పోలీసుస్టేషన్ పరిధిలోని ఔటర్‌రింగ్‌రోడ్డుపై గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మాజీ ఎంపీ మాలోతు కవిత నియోజకవర్గ పరిధిలోని వరంగల్జిల్లాకు చెందినవారు. ఈ విషయం తెలుసుకుని మాజీ ఎంపీ కవిత ఇబ్రహీంపట్నం సివిల్ ఆస్పత్రికి చేరుకున్నారు. కాని, అప్పటికే ఆస్పత్రిలో డాక్టర్లు ఎవరూలేరు. వెంటనే ఆమె స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి ఫోన్‌చేసి ఆస్పత్రి పరిస్థితిని వివరించారు.
నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ఆస్పత్రిలో డాక్టర్లు లేకపోవడం దారుణమన్నారు. మృతదేహాలు ఆస్పత్రిలో పోస్టుమార్టం కోసం ఉండగా, డాక్టర్లు అందుబాటులో లేరు. వెంటనే ఎస్సై, సూపరింటెండెంట్ ఇంటికి వెళ్లి తీసుకురావల్సిన పరిస్థితి ఉందన్నారు. ఎక్కడైనా పోస్టుమార్టం పోలీసుల ఆలస్యంతో జరుగుతుందని, కాని, ఇక్కడ మాత్రం డాక్టర్లు లేక పోస్టుమార్టానికి ఆలస్యమవుతున్నదని ఆమె పేర్కొన్నారు. మృతదేహాలను కూడా సకాలంలో వారి బంధువులకు అప్పగించని పరిస్థితి రావడం దారుణమన్నారు. ఆస్పత్రి పనితీరుపై ఎమ్మెల్యే కూడా అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఇబ్రహీంపట్నంలోని సామాజిక ఆరోగ్యకేంద్రం పనితీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండగా.. మంత్రి దామోదర రాజనర్సింహ స్వయంగా ఆస్పత్రికి వస్తున్నట్లు గత నెలలో ప్రకటించారు. మంత్రి వస్తే ఆస్పత్రి పనితీరు మారుతుందని అం దరూ భావించారు. తీరా మంత్రి పర్యటన వాయిదా వేసుకోవడంతో పరిస్థితి ఎప్పటిలాగే మారింది. జిల్లావైద్యారోగ్యశాఖ అధికారి ఆధీనంలో ఈ ఆస్పత్రి లేకపోవడం, వైద్యావిధాన పరిషత్ పట్టించుకోకపోవడంతో ఈ ఆస్పత్రి పరిస్థితి రోజురోజుకూ మరింత అధ్వానంగా మారుతున్నది.
మరోవైపు డయాలసిస్ పేషంట్ల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేశారు. కాని, ఆస్పత్రిలో డయాలసిస్ కోసం సరిపడా నీళ్లు లేవనే సాకుతో కేంద్రాన్ని కూడా మూసివేసినట్లు రోగులు చెబుతున్నారు. అలాగే, ఈ డివిజన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లే తమ వద్ద పరికరాలు లేవని బయటి నుంచే ఉస్మానియా, ఇతర ఆస్పత్రులకు పంపుతున్నారు. దీంతో ఈ ఆస్పత్రికి వెళ్లటానికే రోగులు భయపడుతున్నారు.