కడ్తాల్, (తలకొండపల్లి) మే 18: అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం తలకొండపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ నిర్మల అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. సభ ప్రారంభంకాగానే అధికారులు శాఖల వారీగా అజెండాను ప్రస్తావించారు. వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు సమస్యలను ప్రస్తావించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో సమస్యలను పరిష్కరించాలని, గ్రామాల్లో పాము, కుక్క కాటుకు గురైన వారికి మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. విధుల నిర్వహణలో అధికారులు అంకితభావంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ కేశవరెడ్డి, తహసీల్దార్ రంగారెడ్డి, ఎంపీడీవో శ్రీకాంత్, ఎంఈవో సర్దార్‌నాయక్, ఏఈలు కఠారియా, విద్యాసాగర్, వైద్యులు కల్పన, సైదమ్మ, ఏపీఎం శ్రీదేవి పాల్గొన్నారు.
కొత్తూరు : గ్రామాల్లో సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదే అని ఎంపీపీ పిన్నింటి మధుసూదన్‌రెడ్డి అన్నారు. మండల సర్వసభ్య సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీటీసీలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఏకరవు పెట్టారు. ముఖ్యంగా విద్యుత్, తాగునీరు తదితర సమస్యలను ప్రజాప్రతినిధులు లేవనెత్తారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ.. గ్రామాల్లో సర్పంచ్‌లు లేనందున ప్రత్యేక అధికారులు, గ్రామ కార్యదర్శులు బాధ్యతలు తీసుకొని పరిష్కరించాలని సూచించారు.
మండలంలోని కొన్ని గ్రామాల్లో తాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం రూ.19 లక్షలు కేటాయించిందని చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు రానివ్వొద్దని అధికారులకు తేల్చిచెప్పారు. ముఖ్యంగా పాఠశాలల్లో మౌలిక వసతుల ఇబ్బందులు ఉంటే తనకు తెలుపాలని సూచించారు. తాను సొంత నిధులు వెచ్చించి పాఠశాలల బాగుకు కృషి చేస్తానన్నారు. సమావేశంలో వైస్ ఎంపీపీ శోభా లింగంనాయక్, ఎంపీడీవో అరుంధతి, ఎంపీటీసీలు జంగగళ్ల కృష్ణయ్య, రవీంద్‌రెడ్డి, డాక్యా, దేశాల అంజమ్మ, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.