షాద్నగర్, ఫిబ్రవరి 12 : రైతులు వినియోగించే విత్తనాలను ప్రభుత్వమే విక్రయించాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం అసెంబ్లీ సమావేశాల్లో రైతుల సమస్యలను ప్రస్తావించారు. ఇటీవల కాలంలో షాద్నగర్ నియోజకవర్గంలో ఓ గ్రామానికి చెందిన రైతు కూరగాయల విత్తనాలను కొనుగోలు చేసి సాగుచేస్తే చేను పెరిగింది కానీ పంట పండలేదని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అన్ని ప్రాంతాల్లో నకిలీ విత్తనాల విక్రయాలు కొనసాగుతున్నాయని, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా వ్యాపారులు రైతులను మోసం చేస్తున్నారని చెప్పారు.
రైతుల శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వమే రైతులకు అవసరమయ్యే విత్తనాలను విక్రయించాలని ప్రభుత్వాన్ని కోరారు. సాగుకు సంబంధించిన విత్తనాల ఉత్పత్తి కోసం ప్రత్యేకంగా భూములను ఎంపిక చేసి విత్తనాల ఉత్పత్తి సాగును ప్రోత్సహిస్తే బాగుంటుందని ప్రభుత్వానికి సూచించారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ నకిలీ విత్తనాలను పూర్తిస్థాయిలో నివారించేందుకు శాఖాపరమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు.