నగర శివారుల్లోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అవిశ్వాసాలు తెరపైకి వస్తున్నాయి. మారిన రాజకీయ పరిణామాలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను మేయర్లు, చైర్మన్లు పట్టించుకోకపోవడం, పాలక మండలి గడువు మరో ఏడాదితో ముగియనుండడం వంటివి కారణమవుతున్నాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో ఇప్పటికిప్పుడు పెద్దగా నిధులుగానీ, పనులుగానీ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
ఇదే అదునుగా భావిస్తూ ఉన్న ఈ ఏడాదిలోనే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఆర్థిక కోణంలో ఆలోచిస్తున్నట్టు వారి సన్నిహితుల దగ్గర అభిప్రాయపడుతున్నారు. కొన్ని చోట్ల రాజకీయ పరిణామాలూ అవిశ్వాసానికి కారణమవుతున్నాయి. ఇప్పటికే బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్, ఇబ్రహీంపట్నం, పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీల్లో అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. తాజాగా ఆదిబట్ల మున్సిపాలిటీలో ఏకంగా అవిశ్వాస తీర్మానాన్ని శుక్రవారం అందించగా, రంగారెడ్డి కలెక్టర్‌కు చేరింది.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 5 (నమస్తే తెలంగాణ)/ఆదిబట్ల: మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అవిశ్వాసాల పండుగ వచ్చింది. ప్రస్తుతం ఉన్న పాలక మండలి గడువు మరో ఏడాదితో ముగియనుంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో ఇప్పటికిప్పుడు పెద్ద ఎత్తున నిధులుగానీ, పనులుగానీ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దీంతో ఉన్న ఈ ఏడాదిలోనే ఇల్లు చక్కబెట్టుకోవాలనే కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ఆర్థిక చూపు కూడా పలు చోట్ల అవిశ్వాసాలకు కారణమవుతుంది. మరికొన్ని కోట్ల రాజకీయ పరిణామాల దృష్ట్యా అవిశ్వాసాలు తెరపైకి వస్తున్నా.
తటస్తంగా ఉండే కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సైతం ఇదే అదునుగా ఆర్థిక వెసులుబాటును చూసుకుంటున్నారు. మరోవైపు రాజకీయ పంతాలతో మేయర్-ఛైర్మన్ పదవుల కోసం కొందరు కోట్లాది రూపాయలు వెచ్చించేందుకు ముందుకు వస్తుండగా… ప్రస్తుతం ఉన్న వారు రాజకీయంగా, ఆర్థికంగా మరో ఏడాది మనుగడ సాధించేందుకు నోట్ల కట్టలకు రబ్బరు బ్యాండ్స్‌ను విప్పాల్సిన అనివార్యత కూడా నెలకొంది. దీంతో ఈ నెలాఖరు వరకు నగర శివారుల్లో అవిశ్వాసాల సందడి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ఆదిబట్ల మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌పై అవిశ్వాస బావుటా ఎగిరింది. ఈ మేరకు కౌన్సిలర్లు కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మానం కూడా ఇవ్వడం విశేషం.
నగర శివారుల్లోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అవిశ్వాసాల సీజన్ వచ్చింది. వాస్తవానికి చాలాచోట్ల గత ఒకటీ, రెండు సంవత్సరాలుగా మేయర్లు, ఛైర్మన్లపై కార్పొరేటర్లు, కౌన్సిలర్లు గుర్రుగా ఉన్నారు. కానీ నిబంధనల ప్రకారం వారిపై అవిశ్వాసానికి అవకాశం లేకపోవడంతో ఇన్నాళ్లూ వారికి చేతులు కట్టేసినట్లుగా ఉంది. కానీ ఈ నెలాఖరుతో దాదాపు అన్ని స్థానిక సంస్థల కాలం నాలుగు సంవత్సరాలు దాటనుండటంతో తిరుగుబావుటాకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్, ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీల్లో అవిశ్వాసానికి ఇప్పటికే రంగం సిద్ధమైంది. తాజాగా ఆదిబట్ల మున్సిపాలిటీలో ఏకంగా అవిశ్వాస తీర్మానమే శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు చేరింది. మిగిలిన ప్రాంతాల్లో కూడా త్వరలోనే ఈ మేరకు తీర్మానాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
ముఖ్యంగా వీటిల్లో రాజకీయ పరిణామాలు, పంతాలు ఒకవంతైతే… వివిధ పార్టీల్లోని కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు అవిశ్వాసం అనేది కామధేనువుగా మారింది. చాలాకాలంగా మేయర్, ఛైర్మన్లు తోటి సభ్యులను పట్టించుకోవడం లేదు. పనుల విషయంలోనూ వారి అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకోవడం లేదు. దీంతో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఇదే అవకాశంగా భావించి.. అవిశ్వాసానికి గళం కలుపుతున్నారు. ఎలాగూ అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఖజానా పరిస్థితి అంతంత మాత్రంగానే తయారైంది.
కేసీఆర్ ప్రభుత్వంలో సీఎం స్పెషల్ ఫండ్, ఇతరత్రా మార్గాల నుంచి నిధులు రావడం వల్ల తమ పరిధుల్లో అభివృద్ధి పనులైనా జరుగుతాయనే ఆశాభావం వారిలో ఉండేది. కానీ ఇప్పుడు కొత్త సర్కారు చివరి ఏడాదిలో ఆర్థికంగా పెద్దగా ఆదుకునే పరిస్థితి ఉండదని, దీనికి తోడు రాజకీయాల కారణంగా పనులేవీ ముందుకుపడవని కార్పొరేటర్ ఒకరు అన్నారు. అందుకే అవిశ్వాసం సందర్భాంగానైనా తమకు ఆర్థిక కొంత ఊరట కలుగుతుందని మనసులోని మాట వెల్లడించారు. తానే కాదు… చాలామంది ప్రజాప్రతినిధులు ఇదేరీతిన ఆలోచిస్తున్నారని, ఉన్న ఒక్క ఏడాదిలో కొంత ఆర్థికంగా రావాలంటే అవిశ్వాసం తప్ప వేరే మార్గేమేమీ కనిపించడంలేదన్నారు.
కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మాన పత్రాన్ని ఇచ్చిన 13 మంది కౌన్సిలర్లు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆదిబట్ల మున్సిపాలిటీలో అధికార పార్టీలోనే ముసలం మొదలైంది. ఇక్కడ 15 వార్డులు ఉండగా… బీఆర్ఎస్, కాంగ్రెస్ చెరో ఏడు స్థానాల్లో గెలవగా, బీజేపీ ఒక స్థానాన్ని గెలుచుకుంది. కాంగ్రెస్‌కు చెందిన కొత్త ఆర్తీక అప్పట్లో బీఆర్ఎస్లోకి వచ్చి మేయర్ పీఠం ఎక్కారు. కొన్నిరోజులుకే తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. దీంతో అవిశ్వాసం కోసం పలువురు కౌన్సిలర్లు ప్రయత్నాలు చేసినా.. నిబంధనలు అడ్డువచ్చాయి. కాగా ప్రస్తుతం ఆ సమయం రావడంతో కౌన్సిలర్లకు అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు, బీఆర్ఎస్కు చెందిన మరో ఆరుగురితో పాటు బీజేపీకి చెందిన కౌన్సిలర్ కూడా అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. దీంతో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ మినహా మిగిలిన వారంతా శుక్రవారం అవిశ్వాస తీర్మాన పత్రాన్ని కలెక్టర్‌కు పంపించారు.
ఆదిబట్ల మున్సిపాలిటీ పాలక వర్గం ఏర్పడినప్పటి నుండి అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటి చేసి గెలుపొందిన కొత్త ఆర్తీక నాటకీయ పరిణామాల మధ్య బీఆర్ఎస్ పార్టీలో చేరి చైర్మన్ అయ్యారు. చైర్మన్ ఎన్నిక సమయంలో అప్పటి కాంగ్రెస్ ఎంపీ కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అప్పటి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో రాజకీయ ఘర్షణ రేగింది. ఛైర్మన్ రేసులో ఉన్న మరో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ మర్రి నిరంజన్‌రెడ్డి ఆ అవకాశం చేజారిన తర్వాత ఛైర్మన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కౌన్సిలర్లతో కలిసి నిత్యం వ్యతిరేకంగానే వ్యవహరించారు. కౌన్సిల్ సమావేశాల్లోనూ వాగ్వాదానికి దిగేవారు. కాగా ప్రస్తుతం నిబంధనల ప్రకారమే అవకాశం రావడంతో అవిశ్వాస అస్త్రం ప్రయోగిస్తున్నారు.