వికారాబాద్, ఏప్రిల్ 6 : మానవుని మనుగడలో ముఖ్యంగా తాగునీరు ఎంతో కీలకం. ఎండాకాలం వస్తే చాలు నీటి కోసం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వికారాబాద్ మున్సిపల్లో ఉన్నా అభివృద్ధిలో మాత్రం ఆమడ దూరంలో కొట్టంగుట్టతండా ఉన్నది. కాంగ్రెస్ సర్కారు వచ్చాక నిత్యం తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని తండావాసులు వాపోతున్నారు.
తెలంగాణ రాకముందు ఎండాకాలం వస్తే చాలు తాగునీటి కోసం చిన్నారులు, పెద్దలు తండాకు దూరంగా గుట్టల మధ్య ఉన్న చెలిమ నీటిని తెచ్చుకొని ఇబ్బందులు పడుతూ కాలం గడిపారు. ఇబ్బందులు తీర్చాలని అప్పట్లో ఎన్నో ప్రభుత్వాలను కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తండాల్లో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీటిని అందించి నీటి సమస్యను కేసీఆర్ తీర్చారు. తమ కష్టాలు తీరాయనుకొని సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీ రాగానే నీటి సమస్యలు ఏర్పడుతున్నాయి.
తండాలో దాదాపు 60 కుటుంబాలు, 100కు పైగా జనాభా ఉంటుంది. తండాకు అరకొరగా నీటి సరఫరా జరుగుతుండటంతో నీరు సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి ట్యాంక్ కడగకపోవడంతో చెత్తాచెదారం నిండుకున్నది. ఆ నీటినే తాగాల్సి వస్తున్నది. గతంలో వేసిన బోరు నుంచి నీరు సక్రమంగా రాకపోవడంతో నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయి.
కూలీ పనులకు సైతం వెళ్లకుండా నీటి కోసం నీటి కోసం పడిగాపులు కాయాల్సి వస్తున్నది. శుక్రవారం పూర్తిగా తండాకు నీరు రాకపోవడంతో మరింత ఇబ్బందులు ఏర్పడ్డాయి. పశువులకు తాగేందుకు నీళ్లు లేక అల్లాడుతున్నాయి. గిరిజనుల సమస్యలు పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తండా వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కనికరించి కొట్టంగుట్టతండా తమకు పుష్కలంగా నీటిని అందించాలని ప్రజలు కోరుతున్నారు.
నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం
తండాను గత కొన్ని రోజులుగా నీటి సమస్య వెంటాడుతున్నది. ట్యాంకును కడగక పోవడంతో చెత్త, పురుగులు వస్తున్నాయి. రెండు మూడు, బిందెలు మాత్రమే నీళ్లు వస్తున్నాయి. శుక్రవారం రోజు మొత్తానికే నీరు రాలేదు. బోరులో నుంచి నీరు సక్రమంగా రాకపోవడంతో నీటి కోసం ఇబ్బందులు పడుతున్నాం. తండాలో నీటి సమస్య ఉన్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. తండావాసుల బతుకులు మారేటట్లు లేవు.
– వల్కీబాయి, కొట్టంగుట్టతండా, వికారాబాద్
మళ్లీ నీటి సమస్యలు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ నీరు ఇంటింటికీ సరిపడా అందేవి. కాంగ్రెస్ సర్కారు వచ్చినంక నీరు సరిపోక ఇబ్బందులు పడుతున్నాం. ట్యాంకు ఉన్నా.. అందులో నీరు లేక ఉండటం లేదు. నీటిని దూరంగా ఉన్న బోరు నుంచి తెచ్చుకోవాల్సి వస్తున్నది. నీటిని మోసుకొస్తుంటే చేతకాక ఇబ్బందులు పడుతున్నాం. బోర్లలో కూడా నీరు సక్రమంగా రాకపోవడంతో పడిగాపులు కాయాల్సి వస్తున్నది.
– జాంగీబాయి, కొట్టంగుట్టతండా, వికారాబాద్
నీటిని తెచ్చుకోవాలంటే కూలీ పనులు మానుకోవాల్సిందే..
గత కొన్ని రోజులుగా నీటి సమస్య వేధిస్తున్నది. ట్యాంకులోకి నీరు రాక, అర కొర నీటితోనే తండాకు నీటిని సరఫరా చేస్తున్నారు. ట్యాంకులో నీరు అడుగంటడంతో అందులో ఉన్న చెత్త, పురుగులు ఇండ్లలోకి వస్తున్నాయి. ఎవరు కూడా ట్యాంకును కడగడంలేదు. ట్యాంకు నుంచి కనెక్షన్లు సక్రమంగా లేకపోవడంతో కింద ఉన్న ఇండ్లల్లోకి మాత్రమే నీరు ఎక్కువగా వస్తాయి. పైకి ఉన్న ఇండ్లకు నీరు రాక ఇబ్బందులు పడుతున్నాం. నీటిని తెచ్చుకోవాలంటే కూలీ పనులు మానుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మా సమస్యను ఏ అధికారీ పట్టించుకోవడంలేదు.
– గోపాల్, కొట్టంగుట్ట తండా, వికారాబాద్